KCR | తెలంగాణ కోసం పల్లె పల్లెకూ తిరిగిండు. గడగడపకూ పోయిండు.
ఉద్యమాన్ని ఉరికించిండు. పల్లె నుంచి ఢిల్లీ దాకా కొట్లాడిండు!
ప్రతి రాష్ట్రం తిరిగిండు! ప్రతి పార్టీని కలిసిండు! మద్దతు కూడగట్టిండు!
నాడు తెలంగాణ కోసమే శ్రీకృష్ణ కమిషన్ ముందుకు పోయిండు!
దశాబ్దాలుగా జరిగిన దగాను, సాగునీటి గోడును విన్నవించిండు!
నేడు అదే తెలంగాణ కోసం కాళేశ్వరం కమిషన్ ముందుకొచ్చిండు!
పడావు భూములను పచ్చగా మార్చిన జలసంకల్పాన్ని వివరించిండు!
మడి తడవాలన్నా మబ్బులకేసి చూసిన తెలంగాణలో ఊరూరా జలభాండం సృష్టించిండు కేసీఆర్. బోర్ల మీద బోర్లు వేసి బోరుమన్న పల్లెల్లో.. పంట నీరిచ్చి కంటనీరు తుడిచిండు కేసీఆర్. పాతాలగరిగె వేసి వెతికినా నీటిజాడ దొరకని నేలన.. గడగడపనూ జలగంగతో తడిపిండు కేసీఆర్.
అగ్నిపరీక్షలు తట్టుకొని నిలబడటం ఆయనకు కొత్తకాదు..
ప్రజలకు మంచి చేసి, పరీక్షకు నిలబడాల్సి రావడమే విషాదం!
చుక్కనీటి కోసం ప్రపంచం గొంతెండి గోస పడుతుంటే..
తెలంగాణలో దూప తీరినంక దుయ్యబడుతుండటమే విషాదం!
నీటి దోపిడీకి, కన్నీటి దోసిలికి కారణమైన కాంగ్రెస్ అధికారంలో ఉన్నది! నీళ్లు పారించి, కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌ను తప్పుపడుతున్నది! మోచేతి నీళ్లకు అలవాటుపడినవాళ్లు.. నీటి పరవళ్లపై నిందలేస్తున్నరు. దశాబ్దాలుగా చిన్న ప్రాజెక్టునూ కట్టలేక చేతులెత్తేసినవాళ్లు.. సుజల కాళేశ్వరంపై బురద చల్లుతున్నరు.
ఎక్కడో చిన్న పగులును చూసి.. మొగులుపై ఉమ్మేస్తే ఎట్లా?
కాళేశ్వరం నీళ్లతో అలుగు దుంకిందని చెరువుపై అలిగితే ఎట్లా?
ఏ చవితి నిందలూ చంద్రుడి కీర్తిని మసకబరచలేదు!
ఏ ‘నీళ్లా’పనిందలూ చంద్రశేఖరుడి ఖ్యాతిని తగ్గించలేవు!
హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నిర్వహించిన ముఖాముఖి విచారణకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు కొనసాగిన విచారణలో మొత్తం 18 ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. వాటికి కేసీఆర్ కూలంకషంగా సమాధానం ఇచ్చినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణకు ఏర్పాటైన కమిషన్ ఇప్పటికే ప్రాజెక్టులో పనిచేసిన అన్నివిభాగాల ఇంజినీర్లు, పనులు నిర్వహించిన ఏజెన్సీ ప్రతినిధులు, ఆడిటింగ్ నిర్వహించిన కాగ్ అధికారులు సహా మొత్తం 112 మందిని విచారించింది.
అన్ని దశల్లో విచారణను పూర్తిచేసిన కమిషన్ ఇటీవల రాజకీయ ప్రముఖుల విచారణను ప్రారంభించింది. ఇప్పటికే మాజీ మంత్రులు టీ హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను విచారించింది. ఈ క్రమంలో బుధవారం బీఆర్కే భవన్లో జరిగిన కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరిన ఆయన 11 గంటలకు బీఆర్కే భవన్‌కు చేరుకుని జస్టిస్ ఘోష్‌ను కలిశారు. ఆరోగ్యం బాగాలేని కారణంగా ఓపెన్ కోర్టులో కాకుండా ముఖాముఖి విచారణకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు జస్టిస్ ఘోష్ అంగీకరించారు. కమిషన్ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ముఖాముఖి విచారణ ఇదే.
ఈ సందర్భంగా ప్రాజెక్టు రీడిజైన్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలు, అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధ్యయనాలకు సంబంధించి కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు కేసీఆర్ సమాధామిచ్చినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను క్రోడీకరించి ఇంగ్లిష్‌లో 40 పేజీలతో రూపొందించిన ‘లైఫ్ లైన్ ఆఫ్ కాళేశ్వరం’ ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఘోష్‌కు అందజేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, క్యాబినెట్ సబ్‌కమిటీ, అత్యున్నత సాంకేతిక, నిపుణుల కమిటీ నివేదించిన రిపోర్టులు, ఇతరత్రా పత్రాలన్నింటినీ పీపీటీతోపాటు కమిషన్‌కు సమర్పించినట్టు తెలిసింది. విచారణ అనంతరం స్టేట్మెంట్పై సంతకం చేసి వెనుదిరిగారు. కేసీఆర్ వెంట శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎర్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.