KCR | ‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’ అంటూ, తోటి సమాజం ఎదుర్కుంటున్న కష్టాలను తన కన్నీటితో కలిపి పంచుకున్న తెలంగాణ మనసు కవి, ప్రజాకవి పద్మవిభూషణ్, కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.
తెలంగాణ జన జీవితానికి పర్యాయపదంగా నిలిచిన కాళోజీ జీవన ప్రస్థానమంతా, తెలంగాణ భాషను, యాసను, మేళవించి తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటన దిశగా సాగిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధన కోసం తాను ప్రారంభించిన మలి దశ పోరాటంలో..‘దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం’ అనే స్పూర్తి ఇమిడి వున్నదని కేసీఆర్ తలిపారు.
పాలకుల అన్యాయం అక్రమాల పై ధిక్కారమే తన నైజమని చాటిన కాళోజీ సాహిత్య స్పూర్తి నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. కాళోజీ నారాయణ రావు కృషిని గౌరవిస్తూ వారి జయంతిని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం “తెలంగాణ భాషా దినోత్సవం”గా ప్రకటించిందని గుర్తు చేశారు.
తెలంగాణ సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన కవులు, రచయితలను ప్రతిఏటా ‘‘కాళోజీ నారాయణరావు’’ పురస్కారాలతో సత్కరించే సాంప్రదాయాన్ని ప్రారంభించామన్నారు.bరి పేరుతో కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నెలకొల్పామని కేసీఆర్ గుర్తు చేశారు.
రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాలకుల దుర్నీతిని ఎండగడుతున్న యువత, కాళోజీ స్పూర్తితో ముందుకు సాగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.