కేసీఆర్ నేర్పిన సిద్ధాంతం ఒకటే.. అధికారం శాశ్వతం కాదు, తెలంగాణ శాశ్వతం! తెలంగాణ చరిత్ర శాశ్వతం! ఏనాడూ కేసీఆర్ పేరుపెట్టి మేము కార్యక్రమాలు చేయాలనుకోలేదు. కేసీఆర్‌కు ఇష్టం లేకున్నా మేమే బలవంతంగా కేసీఆర్ కిట్ అనిపెట్టినం. కీర్తి కోసం కేసీఆర్ ఏనాడూ ఆలోచన చేయలేదు.
-కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నవంబర్ 29న దీక్షా దివస్ నుంచి డిసెంబర్ 9 విజయ్ దివస్ వరకు 11 రోజుల పాటు ఉద్యమ ప్రస్థాన యాత్రపై ఇకనుంచి ఏటా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ చెప్పారు. రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులతో రెండు కమిటీలు వేస్తామని తెలిపారు. తెలంగాణ లిటరేచర్ డే, ఫెస్టివల్ 11 రోజుల సందర్భంగా హైదరాబాద్, వరంగల్ కేంద్రంగా సాహిత్య కార్యక్రమాలు, పుస్తక ఆవిషరణలు చేస్తామని వెల్లడించారు. తొలి, మలిదశ ఉద్యమం, 14 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంపై పెద్ద ఎత్తున పుస్తకాలు తెస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌పై ప్రచురితమైన పుస్తకాల ప్రదర్శనను దీక్షాదివస్ సందర్భంగా తెలంగాణభవన్‌లో బుధవారం కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావజాలవ్యాప్తి (సెన్సిటైజేషన్) ఎప్పటికప్పుడు జరగాలని చెప్పారు. కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారిస్తే రేవంత్‌రెడ్డిని చరిత్ర క్షమించదని స్పష్టంచేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చే కుట్రలో భాగస్వాములైన వారంతా చరిత్రహీనులవుతారని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని హితవు పలికారు.
ప్రాజెక్టులకు దేవుళ్ల పేరు
తెలంగాణలో నిర్మించిన అయా ప్రాజెక్టులకు ఆయా ప్రాంతాల్లో ఉండే దేవుళ్ల పేరు పెట్టినట్టు కేటీఆర్ గుర్తుచేశారు. ‘కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, రాజరాజేశ్వర జలాశయం, సీతారామ ప్రాజెక్టు, సమ్మకసారక బరాజ్, లక్ష్మీ బరాజ్, సరస్వతి బరాజ్, పార్వతి బరాజ్ అని దేవుళ్ల పేర్లు పెట్టుకున్నాం. ఏనాడూ మన పార్టీ నాయకుల పేర్లు పెట్టుకునే ప్రయ త్నం చేయలేదు. ఈ ప్రాంతం శాశ్వతం అనేది మా భావన. తెలంగాణ గొప్పదనం శాశ్వతంగా నిలవాలన్న ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేశాం. కీర్తి కోసం కేసీఆర్ ఏనాడూ ఆలోచన చేయలేదు. కాళోజీ కళాక్షేత్రమని వరంగల్‌లో పెట్టినా దాని తర్వాత ఇతర జిల్లాల్లో కూడా కళాభారతి పేరిట భవనాలు నిర్మించినం. నల్లగొండ, నిజామాబాద్‌లో కవులు, రచయితలకు కేసీఆర్ పెద్దపీట వేయాలనే ప్రయత్నం చేశారు. గ్రంథాలయ అధ్యక్షుడిగా శ్రీధర్ చాలా ప్రయత్నం చేశారు. అనేక కొత్త గ్రంథాలయాలను ప్రారంభించుకున్నాం. ఇంకా చేయాల్సి ఉండె’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ గొప్పదనాన్ని చాటిచెప్పినం
‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంస్కృతి, భాష పరంగా తెలంగాణ గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని కొంత మేర చేసుకున్నం.. విజయవంతమైనం. బతుకమ్మ, బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించుకొని అధికారికంగా జరుపుకొన్నం. తెలంగాణ భాష, యాస ఔన్నత్యాన్ని సిలబస్‌లో పెట్టుకున్నం. మహనీయుల చరిత్రను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసినం. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు గొప్ప నాయకుల పేర్లు పెట్టుకున్నం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు, వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావు పేరు, హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు, హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆసిఫాబాద్‌కు కుమ్రంభీం, భూపాలపల్లికి జయశంకర్ సార్ పేరు పెట్టుకున్నం. కొత్త చరిత్రను ఎలుగెత్తి చాటుకునే ప్రయత్నం చేసినం. తెలంగాణ పోరాటంలోనే సాంస్కృతికత కూడా భాగం కాబట్టి.. ప్రపంచ తెలుగు మహాసభలు రెండోసారి కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించినం. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా మూడు రోజులుపాటు ఘనంగా చేసినం. ఎంతోమంది కళాకారులు, కవులను సతరించి గౌరవించుకున్నం. సాంస్కృతిక సారథిపెట్టి ధూంధాం వ్యవస్థాపకుడిగా ఉన్న రసమయి బాలకిషన్‌ను చైర్మన్‌గా నియమించినం. బాలకిషన్‌కు క్యాబినెట్ హోదా ఇచ్చి అందులో దాదాపు 500 మంది కవులు, కళాకారులకు ప్రభుత్వ కొలువులు ఇచ్చినం. తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకుపోయేలా వారిని గౌరవించినం’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
తెలంగాణ యోధుడు కేసీఆర్: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
‘కేసీఆర్‌కు తన గురించి తాను చెప్పుకోవడం ఇష్టం ఉండదు. కేసీఆర్ గొప్ప గురించి మనం సరిగ్గా చెప్పలేకపోవడం మన తప్పే’ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ అనుచరులు, అభిమానులుగా ఆయన ఉద్యమాన్ని నిక్షిప్తం చేయడంలో పొరపాటు జరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం పనిచేసిన వారిని గుర్తుపెట్టుకోవడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. కేసీఆర్ చరిత్రలో సీఎం పదవి అనేది చాలా చిన్నదని, సీఎం పదవి ఆయనకు కాలిగోటితో సమానమని చెప్పారు. కేసీఆర్‌ను తెలంగాణ తెచ్చిన యోధుడిగానే చూసేందుకు తాను ఇష్టపడతానన్నారు. ‘నాగార్జున సాగర్‌ను కిందికి జరిపినాయనకు ఆంధ్రావాళ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు.. కేసీఆర్ ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను సాధిస్తే ఆయనకు ఇకడి పార్టీలు ఇచ్చిన గౌరవమేమిటి?’ అని నిలదీశారు. కేసీఆర్ మీద కూడా ఎన్నికల్లో పోటీ పెట్టడం బాధాకరమైన విషయమని చెప్పారు. కొందరు కేసీఆర్ మీద రాయడానికి ఎందుకు బిడియపడుతున్నారో అర్థంకావడం లేదన్నారు. మార్స్, లెనిన్, గాంధీ, అంబేద్కర్ గురించి చెప్పేవారు కేసీఆర్ గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ‘కేసీఆర్ దేనినైనా యజ్ఞంలా చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పిచ్చి, తెలంగాణ వచ్చాక అభివృద్ధి పిచ్చి తప్ప మిగతా వేటినీ కేసీఆర్ పట్టించుకోలేదు’ అని గుర్తుచేశారు. ‘మన నాయకుడి గురించి మనం రాసుకోవడానికి ఇబ్బంది ఏమిటి? ఒకే భాష మాట్లాడే వారికి రెండు రాష్ర్టాలు తెచ్చిన ఘనత కేసీఆర్‌దే’ అని కొనియాడారు. కేసీఆర్ 14 ఏండ్ల పోరాటంలో ప్రతి రోజూ ఒక పుస్తకం రాయొచ్చని చెప్పారు.
ప్రతి అన్నం ముద్దలో కేసీఆర్ : ప్రజాకవి గోరేటి
తెలంగాణ సిద్ధాంతాన్ని మనసా వాచా ఆచరించిన నేత కేసీఆర్ అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న చెప్పారు. ప్రతి అన్నం ముద్దలో కేసీఆర్ ఉన్నారని, ఆయ న పేరును ఎవరూ చెరిపేయలేరని స్పష్టంచేశారు. కేసీఆర్ లాంటి మహాత్ములను తిట్ట డం మంచిపద్ధతి కాదని, ప్రజాస్వామ్య భా ష ఉండాలని హితవుపలికారు. ‘మనకే మంచి రోజులొస్తయి. పడిపోవడం మన మంచికే.. కేసులు, నిర్బంధాలతో భయపెట్టాలని చూస్తున్నరు. ఎన్ని కేసులు పెడితే అంత బలంగ లేస్తం.. తెలంగాణ పల్లెలు నాడు ఎలా ఉండేవి.. కేసీఆర్ వచ్చాక ఎలా మారాయో ప్రతి ఒకరికీ తెలుసు’ అని గోరేటి వెంకన్న పేర్కొన్నారు.
కేసీఆర్ సూర్యకాంతి: దేశపతి
‘కేసీఆర్ అనే మూడక్షరాలు కాగితం మీద చేసిన సంతకం కాదు.. కాలం మీద చేసిన సంతకం.. కేసీఆర్ దీపకాంతి కాదు ఆర్పడానికి.. కేసీఆర్ ఓ సూర్యకాంతి’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. కేసీఆర్ దీక్ష ప్రారంభించి ముగించిన 11 రోజుల చరిత్రను పునస్మరణ రోజులుగా అంటే.. నవంబర్ 29 దీక్షా దివస్, డిసెంబర్ 9 విజయ్ దివస్, జూన్ 2 జన్మ దివస్‌గా నిర్వహించుకోవాలని సూచించారు. తెలంగాణలో పారే నదు లు, నిండిన చెరువులు కేసీఆర్ విజయగాథను చెప్తాయన్నారు. ‘బుల్డోజర్ బుల్లోళ్లు కేసీఆర్ చరిత్రను చెరిపేయలేరు. ఎంతో మంది మేధావుల ఆలోచనల నుంచి పుట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ఊరుకోం’ అని హెచ్చరించారు.
ధూంధాం సృష్టికర్త కేసీఆరే: రసమయి
ధూంధాం సృష్టికర్త కేసీఆరేనని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చె ప్పారు. కేసీఆర్ రాయడం మొదలు పెడితే ఈ భూమికి బరువయ్యే పుస్తకాలు రాసేవారని తెలిపారు. ‘నమ్మి నానబోస్తే’ అనే కథారూపాని ఈ నెల 7న ఆవిషరించబోతున్నట్టు వెల్లడించారు. పార్టీ స్థాపనతో కేసీఆర్ తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్లను చాలా వరకు ఆపి గొప్ప నేత అయ్యారని ప్రశంసించారు. నిర్బంధాలకు ఏనాడూ కేసీఆర్ భయపడలేదని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పుట్టాకే ఉద్యమ పాటలు వెల్లువలా వచ్చాయని గుర్తుచేశారు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదని, కేసీఆర్ శకం అని ఈ తరానికి తెలిసేలా రచనలు సాగాలని కోరారు.
ప్రత్యేక పబ్లికేషన్లు అవసరం
తెలంగాణ అస్థిత్వం కోసం ప్రత్యేక పబ్లికేషన్లు అవసరం. ఏడాది రేవంత్‌రెడ్డి పాలనలో ఏవర్గమూ సంతృప్తికరంగా లేదు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. మరిన్ని తెలంగాణ రచనలు కావాలి. కేసీఆర్‌పై యోధా కవిత రాసిన.
-కళ్లెం నవీన్‌రెడ్డి, రచయిత
కేసీఆర్‌పై పుస్తకం రాశా..
1993లో సిద్దిపేట అసెం బ్లీ స్థానం నుం చి టీడీపీ తరఫున కేసీఆర్ పోటీ చేశారు. నాడు నేను ఈనాడు పత్రికలో పనిచేశాను. కేసీఆర్ రాజకీయాల వైపు వెళ్తే.. నేను జర్నలిజం వైపు వెళ్లా. సిద్దిపేటలో కేసీఆర్ నా క్లాస్మేట్. కేసీఆర్‌తో నా అనుబంధం 40 ఏండ్లు. సిద్దిపేట నుంచి సీఎం దాకా అనే పుస్తకం రాశా.
– అంజయ్య, కేసీఆర్ క్లాస్మేట్
కరెంటు ఘనత కేసీఆర్‌దే
సమైక్య రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అసహజ మరణాల్లో విద్యుత్తు చావులే అధికంగా ఉండేవి. బషీర్‌భాగ్ కాల్పుల స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్న. రైతులకు కరెంటు సమస్య లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే. భవిష్యత్తులో కూడా కరెంటు సమస్యలు ఉండకూడదని తెలంగాణ పౌరుడిగా కోరుకుంటున్నా. ‘పవర్ ఫుల్ తెలంగాణ’ అనే పుస్తకంలో విద్యుత్తు రంగ పరిస్థితి వివరించినా
-తుల్జా రామ్‌సింగ్,విద్యుత్తు రంగ నిఫుణుడు
భావి తరాలకు అందాలి
2001 నుంచి బీఆర్ఎస్తో కలిసి నడుసున్నా. తెలంగాణ ఉద్యమ ప్రతి అడుగును దగ్గరి నుంచి గమనించి అనేక పుస్తకాలు తీసుకొచ్చిన. తెలంగాణ అస్థిత్వమే ఆధారంగా ‘పల్లెలు’, ‘ఊర చెరువు’, ‘తడి’ వంటి అనేక పుస్తకాలు రాసిన. తెలంగాణ అక్షర బాంఢాగారాన్ని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నది.
-వనపట్ల సుబ్బయ్య, కవి
కవులను ప్రోత్సహించాలి
తెలంగాణ చరిత్రను కాపాడుకోవాలంటే కవులు, కళాకారులను ప్రోత్సహించాలి. సీనియర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రావాలి. తెలంగాణ అస్థిత్వాన్ని చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని, లోగోను, కాకతీయ కళాతోరణాన్ని మార్చే పరిణామాలపై కవులు, కళాకారులు మౌనంగా ఉండకూడదు.
– ప్రొఫెసర్ మల్లేశం,శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ
చరిత్రను వక్రీకరించే కుట్ర
తెలంగాణ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని తెరమరుగు చేయాలని చూస్తున్నరు. వక్రీకరణలను అడ్డుకునేందుకు ఇలాంటి పుస్తక ప్రదర్శనలు మరిన్ని జరగాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలి.
-ఆయాచితం శ్రీధర్,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్
ప్రపంచానికి కేసీఆర్ స్ఫూర్తి
తెలంగాణకే కాదు ప్రపంచానికి కేసీఆర్ తన పోరాట పటిమతో స్ఫూర్తిని అందించారు. రోడ్ల మీద పోరాటాన్ని, పార్లమెంటరీ పంథాను కలగలిపిన నేత కేసీఆర్. గాంధేయ మార్గంలో తన లక్ష్యాన్ని సాధించిన నేత కేసీఆర్. తెలంగాణలో ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు అత్యంత అవశ్యం. ఇక్కడ సాంస్కృతిక గ్రంథాలయ ఉద్యమాన్ని నిరంతరం నడపాలి. ప్రతిచోటా కేసీఆర్ సాహిత్యాన్ని అందుబాటులో ఉంచాలి.
-పాపారావు,ఆర్థిక రంగ నిపుణుడు
కేసీఆర్ ఓ అష్టావధాని:జ్వాలా నరసింహారావు
కేసీఆర్ ఓ అష్టావధాని లాంటి వారని సీనియర్ జర్నలిస్టు వనం జ్వాలా నరసింహారావు కీర్తించారు. తెలంగాణ రాకముందే కేసీఆర్ అద్భుతమైన విజన్‌ను ఆవిషరించారని గుర్తుచేశారు. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఇద్దరు తెలంగాణ యోధుల దగ్గర పని చేసిన అనుభవం తనకు ఉన్నదని చెప్పారు. కేసీఆర్‌పై వచ్చిన పుస్తకాలను ప్రజల వరకు చేరవేయాలని సూచించారు. తన లైబ్రరీలో ఉన్న ఐదు వేల పుస్తకాలు తెలంగాణ భవన్‌కు డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరీ గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీఆర్ఎస్ నాయకులు మెతుకు ఆనంద్, దేవీ ప్రసాద్, పలువురు ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, తెలంగాణ మేధావులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.
చరిత్ర గురించి సింహాలు చెప్పకపోతే వేటగాళ్లు రాసే పిట్టకథలే చరిత్రగా చెలామణి అవుతాయి. యుద్ధంలో గెలిచినవాడే పరాజితుని గాథ చెరిపేస్తాడనే భావన ఇవాళ తెలంగాణలో కనిపిస్తున్నది. సచివాలయం ఎదుట పెట్టిన రాజీవ్‌గాంధీ విగ్రహ స్థానంలో నాలుగేండ్ల తర్వాత అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. -కేటీఆర్
కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదు.ఇందిరాంధీ తెచ్చిన భారతమాత విగ్రహాన్ని వాజపేయి మార్చిండా?. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి అంత ఎత్తున నిర్మించిన అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కనిపించడం లేదా? ఎందుకు వీటి గురించి మాట్లాడటం లేదు? -కేటీఆర్