తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 12: అమ్మ భాష తెలుగును ముఖ్యమంత్రి కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి ఆయన తీసుకొంటున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధంగా భాష, సంస్కృతి, కళలను కాపాడుకొనేందుకు చొరవ చూపాలని సూచించారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తెలుగు భాషాబోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ సేవ వంటి కార్యక్రమాల ద్వారా తెలుగుభాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, చరిత్రను విశ్వవిద్యాలయం పరిరక్షించుకుంటున్నదని చెప్పారు. తెలుగు గ్రంథాలు ఇతర భాషల్లోకి, ఇతర భాషల గ్రంథాలు తెలుగులోకి అనువాదం విస్తృతంగా జరుగాల్సి ఉన్నదని అన్నారు. ఆధునికకాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతిఒక్కరికి చేరువ చేయాలని సూచించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగు విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నదని చెప్పారు. బాచుపల్లిలో వంద ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వర్సిటీ త్వరలో కొలువుదీరనున్నదని వర్సిటీ వీసీ టీ కిషన్‌రావు ప్రకటించారు. అనంతరం వర్సిటీ ప్రచురించిన తెలుగువాణి పుస్తకాన్ని వెంకయ్యనాయుడు, హోంమంత్రి మహమూద్ అలీ, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ తదితరులు ఆవిష్కరించారు. సాహిత్యంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, కూచిపూడి, ఆంధ్రనాట్యంలో గురువుగా, నర్తకుడిగా విశేష సేవలందించిన కళాకృష్ణకు తెలుగు వర్సిటీ 2018, 2019 సంవత్సరాలకు విశిష్ట పురస్కారాలను ప్రకటించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాటిని వారికి ప్రదానం చేశారు. లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువాతో సత్కరించారు.