జగిత్యాల, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ర్టానికి పట్టిన పీడ, శని విరగడ కావాలి. అది కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యం. తెలంగాణ పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరేద్దాం.. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేద్దాం’ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పుడు ఏ పల్లెకు వెళ్లినా ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదమే వినిపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ రోజు తన సుదీర్ఘ ప్రజాజీవితం ఓ గొప్ప మలుపుగా భావిస్తున్నానని జీవన్‌రెడ్డి చెప్పారు.
పంచాయతీ సమితి అధ్యక్షుడిగా మొదలై, ఆరు పర్యాయాలు జగిత్యాల శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై అందరి ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. కాంగ్రెస్ బలోపేతం కోసం నాలుగు దశాబ్దాల పాటు కృషిచేస్తే చివరకు తనపైనే వివక్ష చూపారని ఆవేదనతో చెప్పారు. తాను మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ పెద్దమనస్సుతో తనకు ఈ వయస్సులో అండగా నిలిచారని చెప్పారు. బీఆర్ఎస్లో పనిచేసే అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

బీఆర్ఎస్ కేసీఆర్‌తో ఉన్న అనుబంధం గురించి జీవన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. ‘ఆయనతో కలిసి పనిచేసినం. ఆయన విద్యార్థి దశలో ఇదే జగిత్యాల అంగడిబజార్‌లో గడిపిండు. జగిత్యాలతో కేసీఆర్ అనుబంధం ఇప్పటి తరానికి తెలియదు. కేసీఆర్ బాల్యజీవితం జగిత్యాలతో ముడిపడి ఉన్నది. ఆనాడు తాడిత, పీడిత వర్గాల సాధన కోసం జగిత్యాల జైత్రయాత్ర ఇదే గడ్డమీద నుంచి ఆరంభించారు. 1978లో ఆనాడు జగిత్యాల జైత్రయాత్ర చేశారు. మళ్లీ అదే స్థలంలో మళ్లీ సభ పెట్టమని చెప్పిండు. మళ్లీ ఇదే సభ నుంచి చెబుతున్న. రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తాం.. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తాం.
‘వాస్తవంగా నాకు కేసీఆర్ అంటే మొదటినుంచీ గౌరవం. ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉండేది. ఒక దశనుంచి ఇద్దరి కలిసిపనిచేశాం. భిన్న పార్టీలు భిన్న రాజకీయాలు వేదిక ఏదైతో ఉండడంతో కలిసి పని చేయలేకపోయాం. మరి అభివృద్ధి ఏదైతే ఉందో రాష్ట్రం ఏర్పాటు అయిన నాడు తానుశాసనభ్యుడిగా ఎంపికయ్యా. నాడు బోర్నపల్లి వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేస్తే అటు ఆదిలాబాద్ ఇటు కరీంనగర్‌కు ఉపయోగపడుతుందని కేసీఆర్‌కు చెబితే ఉమ్మడి కరీంనగర్లో మొట్టమెదటిసారిగా మంజూరు చేసిన్రు. ఇలా అభివృద్ధికి రాజకీయాలు లేవు. అలా గొప్ప నాయకుడు కేసీఆర్’ అని చెప్పారు.
కేసీఆర్ దూరదృష్టి ఉన్న నాయకుడని జీవన్‌రెడ్డి ప్రశంసించారు. ‘ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కరీంనగర్ జిల్లాకేంద్రంగా బయలుదేరిపోతే అందరూ ఆశ్చర్యపోయారు. ఇయనేంది తెలంగాణ ఉద్యమం లేవనెత్తుకున్నడని. ఆయన ఒకే ఒక్కడు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచింది. తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది’ అని గుర్తుచేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ వస్తుంటే మొత్తం కూడళ్లలో యువతలో ఉత్సాహం, కేరింతలు చూస్తుంటే తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ నాయకత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరం. కేసీఆర్ ఆధ్వర్యంలో పని చేసే అవకాశం రావడం సంతోషం. ఇద్దరం కూడా ఒకరిపై పట్ల ఒకరు అభిప్రాయం కలిగి ఉన్నం.
ఇద్దరం కలిసి ప్రయాణించే అవకాశం 2004-2009లో వచ్చింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసినం. కాంగ్రెస్ పార్టీ పక్షాన కేసీఆర్‌ను ఎదుర్కోవడం మామూలు విషయం కాదు.. కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి నన్ను ఆయన ముందు నిలబెట్టింది. ఇగ నా గోస ఏం చెప్పాలె.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేయవట్టి నేను కేసీఆర్ మీద పోటీ చేస్తే 20 నెలలు మీరు నా ఉసురు పోసుకున్నరు’ అని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కలిసి ప్రయాణం చేద్దామని బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ కోరినప్పటికీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్‌లోనే కొనసాగానని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేయటమే గాక యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి ఉద్యమించడంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని వివరించారు. రథసారథిగా రెండు దశాబ్దాల పాటు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే గాక రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి రాష్ర్టాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిపారని జీవన్‌రెడ్డి కొనియాడారు.
హామీల పేరుతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మెరుగైన పాలన తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త పథకాలను అమలుచేయడం అటుంచి.. ఉన్న పథకాలను అటకెక్కించిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎకరానికి రైతుబంధు ఐదు వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలు ఇస్తే.. కాంగ్రెస్ వస్తే రూ.15వేలు ఇస్తామని దగా చేసిందని ధ్వజమెత్తారు. రూ.15వేలు కాదు కదా.. అసలు మూడు పంటలకు పెట్టుబడి కోల్పోయారని ఆగ్రహం చేశారు. ఇవాళ కేసీఆర్ జగిత్యాలకు వస్తున్నరని రెండో ఎకరానికి ఇస్తామంటున్నరని రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు.
అదే విధంగా కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్నరు.. మరీ బంగారం ఏమైందో చెప్పాలని నిలదీశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నదో రాబోయే కాలంలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పరిస్థితి అట్లనే తయారైతదని చెప్పారు. 1994 ఉప ఎన్నికల నాటి పనితీరు కంటే దీనంగా మారుతుందని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజాభిప్రాయం మేరకు పనిచేయాలని వ్యాఖ్యానించారు.
పది జిల్లాలతో 23 జిల్లాలను కలుపుకొని 33 జిల్లాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దని జీవన్‌రెడ్డి కొనియాడారు. కొత్త జిల్లాలతో వైద్య సేవలు మెరుగయ్యాయని చెప్పారు. కేసీఆర్ ఆలోచన, దూర దృష్టితో జగిత్యాల జిల్లాలో వైద్య, విద్య కళాశాల ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. భవిష్యత్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని పేర్కొన్నారు. ‘గురుకుల, జ్యోతిబాపూలే, మైనారిటీ స్కూల్స్, ఎస్టీ, ఎస్సీ గిరిజన బిడ్డల కోసం పాఠశాలలు కట్టించిన ఘనత కేసీఆర్‌ది. లంబాడీలు, ఆదివాసీల భవిష్యత్‌కు అండగా నిలిచిండు. రైతుకు సాగు నీరు, ఉచిత విద్యుత్ అందించారు’ అని గుర్తుచేశారు.

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా ఓ చిన్నారి కేసీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నది. స్థానిక బీఆర్ఎస్ భవన్ నుంచి కేసీఆర్ ప్రత్యేక బస్సులో సభాస్థలికి వస్తుండగా తహసీల్ చౌరస్తా వద్ద నర్సింగాపూర్‌కు చెందిన సులక్షణరావు కేసీఆర్ చిత్రపటా న్ని పట్టుకొని ఉంది. ఆ చిన్నారిని చూసిన కేసీఆర్ బస్సును ఆపించి చిత్రపటాన్ని స్వీకరించి, ముద్దుల వర్షం కురిపించారు.
– జగిత్యాల టౌన్/రూరల్

జగిత్యాల, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): జగిత్యాల పోరాటాల గడ్డ. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ వెంట నడిచింది. ఉద్యమమైనా.. పోరాటమైనా.. ఎన్నికైనా కేసీఆర్ వెంటే ఉంది. ఈ ప్రాంత ప్రజలు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టిన్రు. దురదృష్టవశాత్తు ఇక్కడ ఎన్నికైన ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారిగా మారిండు. గెలిపించిన బీఆర్ఎస్ నాయకులను గానీ, ప్రజలను గానీ పట్టించుకోకుండా కాంగ్రెస్‌లో చేరిండు. తన స్వలాభం కోసం పార్టీ మారిన దుర్మార్గుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న జీవన్‌రెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన చేరికతో బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాంతానికి లాభం జరుగుతుంది.
కేసీఆర్ గురించి చెప్పుకొంటే ఒక చరిత్ర. ఒక్క మనిషి బయలుదేరి, రాష్ర్టాన్నంతా ఏకం చేసి, పద్నాలుగేండ్లు పోరాటం చేసి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. పదేళ్లు పాలించి అన్ని వర్గాలకు లాభం చేసిండు. రాష్ర్టాన్ని దేశంలో నంబర్‌వన్‌గా నిలిపిండు. ఇది మనందరికీ తెలుసు. ఇవ్వాల మనమందరం కేసీఆర్ వెంటే నడుద్దాం. ఇప్పుడు అంతా ఒకటే నినాదం నడుస్తున్నది ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని గొంతెత్తుతున్నరు. అదే నినాదంతో ముందుకు పోయి తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందాం.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు

కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ద్వారా జగిత్యాల గడ్డ మీది నుంచే ప్రజాకంఠక కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు రోజులు దగ్గరపడ్డయి. ఈ రోజు ప్రజా అభిప్రాయం మేరకు ఈ సభ జరుగుతున్నది. కాంగ్రెస్‌కు నాలుగున్నర దశాబ్దాలు సేవలందించి, బయటికి వచ్చిన జీవన్‌రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్లో చేరిండ్రు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ ప్రజానీకంతో కలిసి పోరాటం చేయాలి. భుజంభుజం కలిపి కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణ సస్యశ్యామలం అయ్యేలా కృషిచేయాలి. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి నిరోధక, అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి. ఈ సభా వేదికగా మీరంతా ఏకం కావాలి.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి

1978లో ఆనాడు జగిత్యాల జైత్రయాత్ర ప్రారంభమైంది. నేడు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ రాజకీయ జైత్రయాత్ర ప్రారంభించడం జగిత్యాల ప్రజలకు గర్వకారణం. 2001లో కేసీఆర్ బయలుదేరినప్పుడు ఈ ప్రాంతం అండగా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనా సమయంలో అండగా ఉన్నది. ఇప్పుడు కూడా అండగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. బాధలో ఉన్న ప్రజానీకానికి, అరిగోస పడుతున్న రైతాంగానికి అండగా ఉండేందుకు వచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. 2014 నుంచి 2023 వరకు పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది.
సంక్షేమ ఫలాలు అందినయ్. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. జీడీపీ, ఆర్థిక ఆదాయం, దినసరి వేతనంలో ముందున్నాం. రాష్ట్రంలోని చివరి భూముల వరకు ధరలు పెరిగాయి. ఆస్తుల విలువలు పెరిగినయ్. వీటన్నింటికీ కారణం కేసీఆర్ మాత్రమే. 2023లో వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించకపోవడం, ఆర్థిక సంపద పెంచకపోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల ప్రజలు దగా పడుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో చేరిన జీవన్‌రెడ్డితో పాటు వారితో వచ్చిన నాయకులందరితో కలిసి కేసీఆర్ నాయకత్వంలో జగిత్యాలలో మూడోసారి గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి జగిత్యాల గడ్డ అండగా ఉంటుంది.
-ఎల్ రమణ, ఎమ్మెల్సీ