Private Teachers | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న టీచర్లను కించపరిచేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డిగ్రీ ఫెయిలైనోళ్లే ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నారని ఉపాధ్యాయుల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి కామెంట్ చేయడంపై ప్రైవేట్ టీచర్లు మండిపడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తమకు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మానవీయకోణంలో నాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్పందించారు. ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని నిర్ణయించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందిని అక్కున చేర్చుకున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.2 వేల ఆర్థిక సాయం, 25 కిలోల రేషన్ బియ్యం అందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10,534 ప్రైవేట్ పాఠశాలల నుంచి మొత్తంగా 2,06,345 దరఖాస్తులు రాగా, అందులో దాదాపు 1.20 లక్షల మందిని అర్హులను గుర్తించారు. వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు తదితర వివరాలను సేకరించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి అకౌంట్లలో వేయడంతోపాటు, 25కేజీల రేషన్ బియ్యాన్ని అందజేశారు. ఈ విషయాన్నే ప్రస్తుతం ప్రైవేట్ టీచర్లు గుర్తుచేసుకుంటున్నారు.