Congress Govt | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సమ్మిళితాభివృద్ధే ధ్యేయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లపాటు శ్రమించి రాష్ర్టానికి బలమైన ఆర్థిక పునాదులు వేశారు. పసికూనగా ఉన్న రాష్ర్టాన్ని అన్ని విషయాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఆ బాటలో నడవడం కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక (సోషియో ఎకనామిక్ ఔట్లుక్)-2025 దీన్నే తేటతెల్లం చేస్తున్నది.
పదేండ్ల ప్రగతిని దాచాలని..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం కూడా ఎంతో పెరిగింది. ధాన్యం దిగుబడి కొత్త రికార్డులను నమోదు చేసింది. అంతేకాదు.. విద్యుత్తు సంస్థల బలోపేతం, స్థాపిత విద్యుత్తు సామర్థ్యంలో పెరుగుదల, విద్య-వైద్య రంగాల అభివృద్ధి, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, వైద్య కళాశాలల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, అన్నివర్గాల అభ్యున్నతికి 400కు పైగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇలా చెప్పుకొంటూ పోతే ఆ జాబితా ఎంతో పెద్దది. అయితే, తాజా ఆర్థిక సర్వేలో ఆ అంశాలను, లెక్కలను కేవలం ఒక్క ఏడాదికే పరిమితం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అదేదో తమ ఘనతగా చెప్పుకొనే ప్రయత్నం చేసింది.
గతంలో జరిగిన ప్రగతిని విస్మరించి.. తాము 15 నెలల కాలంలో చేపట్టిన, ఇకపై చేపట్టబోయే పనుల గురించి మాత్రమే ఏకరువు పెట్టింది. అంతేకాదు నిజాలను కూడా దాచిపెట్టింది. ఉదాహరణకు.. కేసీఆర్హయాంలో ప్రారంభించిన హరితహారం పథకం వల్లే రాష్ట్రంలో గ్రీన్ కవరేజీ జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువగా పెరిగింది. అయితే, ఆర్థిక సర్వేలో అటవీ విస్తీర్ణం ఎంత ఉందన్న విషయాన్ని మాత్రమే పేర్కొన్న రేవంత్ ప్రభుత్వం.. దానికి కారణమైన ‘హరితహారం’ పథకాన్ని నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇదొక్క విషయమే కాదు.. దాదాపు ప్రతీ రంగంలో పదేండ్లలో తెలంగాణ సాగించిన ప్రగతిని విస్మరించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆర్థిక సర్వేలో అడుగడుగునా ఈ విషయం తేటతెల్లమైంది.
తలసిరిలో తగ్గిన దూకుడు!
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను (జీఎస్డీపీ)ని ప్రామాణికంగా తీసుకొంటారు. కేసీఆర్ ప్రభుత్వహయాంలో గడిచిన పదేండ్లలో తెలంగాణ ఈ రెండు అంశాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఒక్క తలసరి, జీఎస్డీపీలోనే కాదు.. సాగు, పారిశ్రామికీకరణ, సేవలు, సంక్షేమం.. ఇలా అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించింది.అయితే, ఆ ఒరవడిని కొనసాగించడంలో రేవంత్ ప్రభుత్వం చతికిలపడినట్టు ఆర్థిక సర్వేలోని గణాంకాలను బట్టి తెలుస్తున్నది. రాష్ట్రంలో సగటున ఒక్కో పౌరుడు సంపాదించే మొత్తాన్ని తలసరి ఆదాయంగా పిలుస్తారు. తలసరి ఆదాయంలో వృద్ధిరేటును ఒక దేశం లేదా రాష్ట్ర అభివృద్ధి వేగానికి నిదర్శనంగా భావించొచ్చు.
ఈ రెండు అంశాల్లో జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే.. తెలంగాణ గతంలో ఎంతో ఎత్తులో ఉండేది. కేసీఆర్హయాంలో గడిచిన పదేండ్లలో చేపట్టిన సంస్కరణలే దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే, తలసరి ఆదాయం విషయంలో కేసీఆర్ హయాంలో నమోదైన రికార్డులు.. రేవంత్ 15 నెలల పాలనలో తగ్గుముఖం పట్టాయనే చెప్పొచ్చు. కేసీఆర్ పదేండ్లపాలనలో తలసరి ఆదాయంలో సగటున వృద్ధిరేటు 15.34 శాతంగా నమోదైతే, కాంగ్రెస్ పాలనలో ఇది కేవలం 9.6 శాతానికే పరిమితమైంది. కాగా దేశ తలసరి ఆదాయం కంటే, రాష్ట్రంలోని దాదాపు 30 జిల్లాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటం గమనార్హం. కేసీఆర్వేసిన ఆర్థిక పునాదులే దీనికి కారణంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
తలసరి డీలా
బీఆర్ఎస్హయాంలో గడిచిన పదేండ్లలో కేసీఆర్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో తెలంగాణ పౌరుల తలసరి ఆదాయం రాకెట్ వేగంతో దూసుకుపోయింది. జాతీయ తలసరి కంటే రెట్టింపుగా ఉండేది. అయితే ఆ వేగానికి రేవంత్ ప్రభుత్వం బ్రేకులు వేసినట్టు ఆర్థిక సర్వే గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. కేసీఆర్ పదేండ్లపాలనలో తలసరి ఆదాయంలో సగటున వృద్ధిరేటు 15.34 శాతంగా నమోదైతే, కాంగ్రెస్ పాలనలో ఇది కేవలం 9.6 శాతానికే పరిమితమైంది.
తలసరి ఆదాయం ఇలా..(రూపాయల్లో)
జీఎస్డీపీలో వృద్ధిరేటు పతనం
ఒక రాష్ట్రంలోని మొత్తం పౌరుల ఉత్పాదకతను స్థూలంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)గా పిలుస్తారు. తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు 2014-15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ. 5.05 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే, 2022-23నాటికి తెలంగాణ జీఎస్డీపీ రూ. 13.13 లక్షల కోట్లకు చేరింది. పదేండ్ల వ్యవధిలో తెలంగాణ జీఎస్డీపీ రూ. 8 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇప్పుడు అది రూ. 16.12 లక్షల కోట్లకు చేరింది. అయితే కేసీఆర్పాలనతో పోలిస్తే, జీఎస్డీపీ వృద్ధిరేటు రేవంత్ పాలనలో 1.8 శాతం మేర తక్కువగా నమోదైనట్టు ఆర్థిక సర్వే గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. జీఎస్డీపీలో వ్యవసాయరంగం వాటా నిరుడు 18 శాతంగా ఉంటే ఈ ఏడాది 17.3 శాతానికి పడిపోయింది. పరిశ్రమలు, మైనింగ్, తయారీ రంగం వాటా నిరుడు 16.8 శాతంగా ఉండగా ఇప్పుడు 16.4 శాతానికి పరిమితమైంది. రేవంత్ ప్రభుత్వ అసమర్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పాదకతను దెబ్బతీసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నాటి జీఎస్డీపీ దూకుడు ఏది?
2014-15లో తెలంగాణ జీఎస్డీపీ రూ. 5.05 లక్షల కోట్లుగా నమోదైంది. 2022-23నాటికి ఇది రూ. 13.13 లక్షల కోట్లకు చేరింది. అయితే, కాంగ్రెస్‌పాలనలో జీఎస్డీపీ వృద్ధిరేటు కుంటుపడింది. కేసీఆర్‌పాలనలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు కంటే తెలంగాణ జీఎస్డీపీ వృద్ధిరేటు 2.8 శాతం ఎక్కువగా ఉంటే, ఇప్పుడు రేవంత్‌పాలనలో నమోదైన జీఎస్డీపీ వృద్ధిరేటు దేశ జీడీపీ వృద్ధిరేటు కంటే 0.2 శాతం మాత్రమే ఎక్కువగా ఉన్నది. అంటే కేసీఆర్‌పాలనలో పోల్చిచూస్తే, ఇది 2.6 శాతం తక్కువ.
తెలంగాణ జీఎస్డీపీ (ప్రస్తుత ధరల్లో)
జీఎస్డీపీలో దేని వాటా ఎంత?
సాగును వదిలి..రైతు కదిలి..
కేసీఆర్ పదేండ్లపాలనలో సాగు, దాని అనుబంధరంగాల్లో గణనీయమైన ప్రగతి జరిగింది. రైతులకు ఎవుసం ఒక పండుగగా మారింది. అందుకే 2023లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి దాదాపు 47.34 శాతం మంది ఉపాధి పొందేవారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అయితే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సాగును వదిలిపెట్టిన వారి సంఖ్య ఏకంగా 4.64 శాతంగా నమోదైంది. సాగునీటికి గోస, ఎరువుల కొరత, రుణమాఫీ కాకపోవడం, రైతు భరోసాలో జాప్యం జరుగడమే వ్యవసాయరంగాన్ని రైతులు వీడటానికి
కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీఎస్డీపీలో వ్యవసాయరంగం వాటా ఇలా..
పరిశ్రమ వాటాలోనూ కోత!
జీఎస్డీపీలో పరిశ్రమలు, మైనింగ్, తయారీ రంగం వాటా నిరుడు 16.8 శాతంగా ఉండగా ఇప్పుడు 16.4 శాతానికి పరిమితమైంది. దీన్నిబట్టి రేవంత్ పాలనలో పారిశ్రామికరంగం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం అర్థమవుతున్నది. ఇప్పటికే విపణిలో ఉద్యోగ సంక్షోభం నెలకొనగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కేన్స్, కార్నింగ్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలిపోవడం తెలిసిందే.
జీఎస్డీపీలో పారిశ్రామికరంగం వాటా తగ్గుదల ఇలా..
హరితహారంతోనే పచ్చని తెలంగాణ
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హరితహారం కార్యక్రమంతో తెలంగాణ ఆకుపచ్చని తోరణంగా మారింది. రాష్ట్రంలో 27,688 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పర్చుకొన్నదని ఆర్థిక సర్వే నివేదిక తెలిపింది. జాతీయ సగటు 23.59 శాతంతో పోలిస్తే, తెలంగాణలో అటవీ విస్తీర్ణం 24.69 శాతంగా (1.1 శాతం ఎక్కువ) ఉన్నట్టు వెల్లడించింది. అయితే రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో హరితహారం పథకం దాదాపు మూలనపడింది. తాగేందుకే నీళ్లు లేని పరిస్థితిలో ఇక హరితహారం మొక్కలు, చెట్లను పట్టించుకునే వారే లేకుండాపోయారు. దీంతో పచ్చని మొక్కలు కాస్త ఎండిపోతున్నాయి.
గ్యారెంటీల్లేని వ(భ)ట్టి బడ్జెట్: వేముల
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆరు గ్యారెంటీల్లేని వట్టి బడ్జెట్ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దెప్పిపొడిచారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో వెలుగిన తెలంగాణ.. కాంగ్రెస్ 15 నెలల పాలనలో అంధకారంలోకి వెళ్లిందని విమర్శించారు. యువ వికాసం పేరిట అధికార పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టే కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్ రైతులు, రైతుకూలీలు, మహిళలు, వృద్ధులు, బీసీలు, మైనార్టీలను మోసం చేసిందని నిప్పులు చెరిగారు.