త్రిదండి చినజీయర్‌స్వామి
భద్రాచలం, సెప్టెంబర్ 3 : తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారని త్రిదండి చినజీయర్ స్వామి కొనియాడారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జీయర్ మఠంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శ్రీరాముడు నడియాడిన, వెలిసిన దివ్యక్షేత్రంలో శ్రీకృష్ణపరమాత్మ పూజలు అందుకోవడం దైవలీలాగా అభివర్ణించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని ప్రతి ఒక్కరికీ ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు. దేశం, రాష్ర్టాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అహోబిల రామానుజ జీయర్ స్వామి, జీయర్ మఠం నిర్వాహకులు, దేవస్థానం ఈవో బానోత్ శివాజీ, వికాస తరంగిణి సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.