సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొన్నా అది సంచలనమే. తాజాగా హరితనిధిని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించి, సభ ఆమోదం తీసుకొని, ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. కేసీఆర్ ప్రతిపాదన ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి నెలా రూ.500లు హరితనిధికి జమ చేస్తారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల నుంచి, వ్యాపారుల నుంచి కొంతమొత్తాన్ని వసూలుచేసి, హరితనిధికి జమచేస్తారు. తద్వారా రాష్ట్రం మొత్తం హరితమయం చెయ్యడానికి ప్రజల భాగస్వామ్యం కూడా కల్పించడం ఈ ప్రతిపాదన విశేషం. దేవాలయాలకు వెళ్లినప్పుడు మనకు తోచిన కానుకలను హుండీలో సమర్పిస్తాం. ఆలయాలను అభివృద్ధి చెయ్యడానికి భక్తులను కూడా భాగస్వాములను చెయ్యడమే హుండీ ఏర్పాటు పరమార్దం. రాష్ట్రం మొత్తం పచ్చదనం పరచుకొంటే ఆ ఆహ్లాదాన్ని రాష్ట్ర పౌరులు, పర్యాటకులు కూడా అనుభవిస్తారు. ఆ పచ్చదనంలో మన వాటా కూడా ఉన్నదనే తృప్తి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే తెలంగాణ పర్యాటకరంగంలో విశేషమైన అభివృద్ధిని సాధిస్తున్నది. -మురళీమోహనరావు ఇలపావులూరి