హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడు నెలలైనా కాకముందే పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నది. బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టానికి క్యూకట్టిన పెట్టుబడులు ఇప్పుడు తిరోగమనబాటలో పయనిస్తున్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ నిరుడు చెన్నైకి తరలిపోగా, తాజాగా సెమీ కండక్టర్ల తయారీ దిగ్గజం కేన్స్ సెమీకాన్ కంపెనీ గుజరాత్ తరలిపోతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. రూ.2,800 కోట్లతో కొంగరకలాన్‌లో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ కోసం కేన్స్ సెమీకాన్ సంస్థ నిరుడు అక్టోబర్‌లో శంకుస్థాపన చేసింది. రెండు నెలలపాటు జోరుగా కొనసాగిన నిర్మాణ పనులను ఆ తర్వాత నిలిపివేసింది. ఆ తర్వాత ఏమైందో కానీ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు ప్రణాళికను అకస్మాత్తుగా నిలిపివేసింది. ఇప్పుడీ పరిశ్రమను గుజరాత్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఓ ఆంగ్లపత్రిక మంగళవారం కథనాన్ని ప్రచురించింది.
కొంగరకలాన్ యూనిట్ ఈఎంఎస్గా మార్పు
ఆంగ్లపత్రిక కథనం ప్రకారం.. కేన్స్ సెమీకాన్ సంస్థ గుజరాత్‌లోని సనంద్‌లో రూ. 5 వేల కోట్ల (రూ.1000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్‌సహా) పెట్టుబడితో ఔట్సోర్సింగ్ సెమికండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) యూనిట్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం అక్కడే అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ మైక్రాన్తోపాటు మురుగప్ప గ్రూప్‌కు చెందిన సీజీ పవర్ కూడా చిప్‌ల అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏటీఎంపీ) యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాయి. గుజరాత్లో సెమీకండక్టర్ల ఎకోసిస్టం మెరుగ్గా ఉండడంతోనే కేన్స్ సంస్థ అక్కడికి తరలివెళ్తున్నది. ఈ నేపథ్యంలో కొంగరకలాన్‌లోని ప్రతిపాదిత యూనిట్‌ను ఈఎంఎస్ (ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్) యూనిట్‌గా మార్చనుంది. సనంద్‌లో ఓఎస్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రోత్సాహకాల కోసం కేన్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని, మరికొన్ని రోజుల్లోనే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల వచ్చే అవకాశం ఉందని పత్రిక తన కథనంలో పేర్కొంది. సనంద్ ఓఎస్ఏటీ కోసం ఇప్పటికే 25 మంది సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు, శిక్షణ తీసుకుంటున్న ఇతర ఉద్యోగులు కాకుండా మరో 10మంది మహిళా ఉద్యోగులను కూడా సంస్థ నియమించుకున్నట్టు పేర్కొంది. కేన్స్ సంస్థ తరలిపోతున్నట్టు వస్తున్న వార్తలపై పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ స్పందిస్తూ ఆ విషయం తనకు తెలియదని బదులిచ్చారు. సెమీకండక్టర్ల తయారీలో కేన్స్‌తో భాగస్వామ్యమైన కంపెనీలు కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించాయి.
సెమీకండక్టర్ల పరిశ్రమకు కేరాఫ్‌గా గుజరాత్
ప్రపంచంలోని నాలుగు ప్రముఖ సంస్థలు భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చాయి. రాబోయే ఐదేండ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో మొదటి ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని కేంద్రం భావిస్తున్నది. తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ కార్ప్‌తో కలిసి టాటాగ్రూప్ దేశంలోనే మొట్టమొదటి యూనిట్‌ను రూ. 91,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని ధోలేరాలో ఏర్పాటు చేస్తున్నది. ఇందులో సెమీకండక్టర్ ఫ్యాబ్ సౌకర్యం కూడా ఉంది. ఇదే గ్రూపు అస్సాంలోని మోరిగావ్‌లో రూ. 27,000 కోట్లతో చిప్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏటీఎంపీ) సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నది. సీజీ పవర్ కంపెనీ జపాన్‌కు చెందిన రెనెసాస్, థాయ్‌లాండ్‌కు చెందిన స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంలో సనంద్‌లో రూ. 76,00కోట్ల వ్యయంతో చిప్ అసెంబ్లీ సౌకర్యాన్ని ఏర్పాటుచేస్తున్నది. తాజాగా కేన్స్ సంస్థ కూడా సనంద్‌లో యూనిట్ ఏర్పాటునకు సన్నాహాలు చేస్తుండడం గమనార్హం. కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా ఉన్న కేన్స్ సెమీకాన్ సంస్థ నూరుశాతం కేన్స్ టెక్నాలజీ అనుబంధ సంస్థ. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ సంస్థ మైసూరు, బెంగుళూరు, చెన్నయ్, పూణె, మనేసర్, పర్వానూ తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్సీసు(ఈఎంఎస్)లను, ముంబై, కొచ్చిలలో సర్వీస్ సెంటర్లను కలిగివుంది.
కార్నింగ్ వెళ్లిన మూడు నెలలకే
అమెరికాకు చెందిన గొరిల్లా గ్లాస్ తయారీ సంస్థ కార్నింగ్ సైతం మొదట తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటునకు ముందుకొచ్చింది. అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపి కంపెనీ ఏర్పాటునకు అవసరమైన ప్రణాళికలు ప్రకటించింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన కొద్ది రోజుల్లోనే సదరు సంస్థ తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకొని చెన్నయ్‌కు తరలివెళ్లింది. అక్కడ రూ. 1000 కోట్ల పెట్టుబడితో 300మంది ఉద్యోగులతో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. కేటీఆర్ కృషితో పలు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఫాక్స్కాన్తోపాటు కేన్స్ వంటి సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేస్తే ఎలక్ట్రానిక్స్‌తోపాటు సెమీకండక్టర్ల తయారీలోనూ తెలంగాణకు ప్రత్యేక స్థానం దక్కేది. కేన్స్ వంటి దిగ్గజ సంస్థ గుజరాత్‌కు తరలివెళ్లడం రాష్ర్టానికి పెద్దదెబ్బగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పరిశ్రమలను తరలిపోనివ్వద్దు
రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతుండడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. సెమీకండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సెమీకాన్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు తరలిపోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ కంపెనీ కర్ణాటక వెళ్లేందుకు సిద్ధపడితే ఎన్నో ప్రయత్నాలు చేసి తెలంగాణలో పెట్టుబడికి ఒప్పించామని గుర్తుచేసుకున్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ పరిశ్రమకు దగ్గరగా భూమి కావాలంటే పది రోజుల్లోనే అవసరమైన భూమిని కేటాయించినట్టు, కంపెనీని ఒప్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడీ కంపెనీ గుజరాత్‌కు తరలిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. ఈ కంపెనీ ఓఎస్ఏటీ (ఓశాట్) యూనిట్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంతోపాటు, సెమీకండక్టర్ పరిశ్రమ ఎకో సిస్టంకు అత్యంత కీలకమైనదని, ఈ పరిశ్రమ వస్తే ఈ రెండు రంగాల్లో రాష్ట్రం మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి అవసరమైన చర్చలు జరిపి తెలంగాణలోనే తమ పెట్టుబడులను కొనసాగించే విధంగా ఒప్పించాలని కేటీఆర్ సూచించారు. లేదంటే రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పదేండ్లపాటు చేసిన కృషి నిష్ఫలం అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.