హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధును ఉద్దేశించి అన్న ‘న్యూసెన్స్’ పదాన్ని రికార్డుల నుంచి తొలిగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆ పదం అభ్యంతరకరంగా ఉన్నట్లయితే రికార్డుల నుంచి తొలిగిస్తానని చైర్మన్ ప్రకటించారు. మండలిలో శనివారం ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాం గ్రెస్ సభ్యులు అబద్ధాలు, అసత్యాలు చెప్తున్నారంటూ.. తాతా మధు అభ్యంతరం వ్యక్తంచేసే ప్రయత్నం చేశారు.
దీంతో చైర్మన్ ఆ సభ్యుడిని వారిస్తూ.. రన్నింగ్ కామెంట్ చేయవద్దని, ‘న్యూసెన్స్’ చేయొద్దని గట్టిగా చెప్పారు. దీనిపై కవిత అభ్యంతరం చెప్పారు. న్యూసెన్స్ అన్న పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. వెంటనే స్పందించిన చైర్మన్ బదులిస్తూ.. ఇలాంటి అభ్యంతరకరమైన, అన్‌పార్లమెంటరీ పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులకు సముచిత స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.