Congress | హైదరాబాద్, డిసెంబర్5 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, ఇతర ప్రజాసంఘాల నేతల అరెస్టుల విషయంలో కాంగ్రస్ ప్రభుత్వం తన మార్క్ చూపుతున్నది. నేతలను మానసికంగా ఒత్తిడికి గురిచేసేందుకే శుక్రవారం అరెస్టు చూపుతున్నారు. న్యాయస్థానాలకు శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో బెయిల్ రాకుండా అడ్డుకోవాలన్న కుట్రకోణం దాగి ఉన్నది. గతంలో అనేక మంది బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న సందర్భాల్లోనూ ఇదేవిధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. శాంతిభద్రతలను సాకుగా చూపి అధికారి పార్టీ నాయకుల ఒత్తిడితోనే పోలీసులు నిర్బంధం విధిస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని తాజాగా అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లకుండా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గురువారం రాత్రి వరకు ఆయన అరెస్టును చూపలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కౌశిక్‌రెడ్డి అరెస్టు విషయమై పోలీసులు స్పీకర్ అనుమతి తీసుకోకుండానే అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతల డిమాండ్‌తో సాయంత్రం కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దల సూచనలతోనే పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
పోలీసులపై ప్రివిలేజ్ మోషన్!
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ కమిషనర్లు, ఇతర అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాబోయే శాసనసభ సమావేశాల్లో సభాహక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీసు ఇవ్వాలని బీఆర్ఎస్ యోచిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా తమను అదుపులోకి తీసుకోవడం, దురుసుగా వ్యవహరించడం, అక్రమ కేసులు పెట్టడం వంటి చర్యలపై ప్రివిలేజ్ మోషన్ కింద నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.