హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీ విధానాలతో విసుగు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కత్తి కార్తీక(Kathi Kartika) శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆమె గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, కార్తీక 2021లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేసి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలోనూ ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతుండటంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తలలు పట్టుకుంటున్నది. మరో వైపు బీఆర్ఎస్లో చేరికల జోష్ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నది. కొత్త, పాత అనే తేడా లేకుండా కలికట్టుగా బీర్ఎస్ విజయానికి కృషి చేస్తామని ఉత్సాహంగా చెబుతున్నారు.