శ్రీనగర్, సెప్టెంబర్ 17: రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నారని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కశ్మీరీ పండిట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న నిరుద్యోగం, గృహ నిర్మాణ సమస్యలను తక్షణం తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఈ క్రమంలో 1990లో జమ్ముకశ్మీర్ నుంచి మూకుమ్మడిగా వలస వెళ్లిపోయిన కశ్మీర్ పండిట్లు సుమారు 35 ఏండ్ల తర్వాత కూడా తాము అదే దుస్థితిలో ఉండటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు తమ సమస్యలను తీర్చడంలో విఫలమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న అసాధ్య వాగ్దానాల పట్ల కశ్మీర్ పండిట్ల ప్రతినిధి బబ్లూ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కేవలం తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, వారిచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా రిక్తహస్తాలు చూపుతున్నాయని అన్నారు. అదే సమయంలో ముస్లింలతో తమ సంబంధాలు పటిష్ఠంగా ఉన్నాయని తెలిపారు.
కేంద్రం హామీలు గాలికి..
కేంద్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకాలేదని బబ్లూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వలసపోయిన కశ్మీర్ పండిట్లకు 6 వేల ఉద్యోగాలు, ఇళ్లు నిర్మించి ఇస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే 2,500 గృహాలు మాత్రమే నిర్మించారని చెప్పారు. నాలుగేండ్లయినా మరో 2,500 ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. తమను వెనక్కి రప్పించాలని ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏడాదిలో దానిని పూర్తి చేసి ఉండేదని బబ్లూ పేర్కొన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ నేతలకు కశ్మీరీ పండిట్లు గుర్తుకు వస్తారని సునీతా భాన్ అనే కశ్మీరీ పండిట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ అనేకమంది కశ్మీరీ పండిట్ల పిల్లలు ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారని గుర్తుచేశారు.