హైదరాబాద్: విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ (Karne Prabhakar) అన్నారు. తమ గ్రామంతోపాటు, సొంత ప్రాంతం కోసం అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. అమెరికాలోని ఓహియోలో కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కర్నె ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రం సాధించిన కేసీఆర్‌కు కృతజ్ఞతగా, వారికి అండగా నిలవాలని కొలంబస్ తెలంగాణ వాసులకు విజ్ఞప్తి చేశారు. పేద విద్యార్థులకు సహకారం అందించాలని, నిరుపేదలకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా, దివంగత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాగంటి గోపీనాథ్‌కు కొలంబస్‌లోని తెలంగాణ వాసులతో కలిసి కర్నె ప్రభాకర్ నివాళులు అర్పించారు.