చౌటుప్పల్, ఆగస్టు 6: ఉన్నత చదువులు చదివినా మూలలను మరువకుండా కులవృత్తిలో కొత్తదనం కోసం శ్రమించి జాతీయ స్థాయిలో మెరిశాడు ఈ యువ చేనేత కళాకారుడు. సహజ సిద్ధ రంగులు ఉపయోగించి, తక్కువ బరువు, ఎక్కువ డిజైన్లతో చీరె నేసి కేంద్ర పురస్కారానికి ఎంపికయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కర్నాటి ముఖేశ్ బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా చేనేతనే ప్రధాన వృత్తిగా ఎంచుకొని పదిహేనేండ్లుగా అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సహజ సిద్ధమైన రంగులతో 46 అంగుళాల వెడల్పు, ఏడు మీటర్ల పొడవుతో 600 గ్రాముల తేలికైన చీరెను నేశాడు. దాదాపు 100 రకాల డిజైన్లు వేశాడు. చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర, చేనేత జాళి శాఖ జాతీయ స్థాయిలో 14 మంది కళాకారులను పురస్కారానికి ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ముఖేశ్ ఒకరు మాత్రమే ఎంపికయ్యాడు. బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ముఖేశ్ పురస్కారం అందుకోనున్నాడు.