హైదరాబాద్: కర్ణాటక గీత కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించినందుకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లకు.. గీత కార్మికుల పక్షాన కర్ణాటకలో కల్లు నిషేధంపై సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న శ్రీ నారాయణగురు శక్తిపీఠం పీఠాధిపతులు.. ఆర్య, ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ప్రణవానంద స్వామి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులను కలిసి కృతజ్ఞతలు చెప్పారు.
గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కర్ణాటక రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రణవానంద స్వామి డిమాండ్ చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కల్లును నిషేధించి గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసింది. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది. దాంతో కర్ణాటకలోని బీజేపీ సర్కారు తీరును తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పలు వేదికలపై ఎండగట్టారు.
ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులవృత్తులను, చేతి వృత్తులను నిర్వీర్యం చేసి వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రణవానంద స్వామి మంత్రులకు వివరించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గౌడ కులస్తులకు వర్తింపజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కర్ణాటకలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ళ వేములయ్య గౌడ్, సంఘం రాష్ట్ర నేతలు ధనుంజయ గౌడ్, రవి గౌడ్, సుదర్శన్ గౌడ్, సంజయ్ గౌడ్, ప్రతాప్ గౌడ్, బత్తిని లతా గౌడ్, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.