Tungabhadra | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర నదిని చెరబట్టేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే నావలి రిజర్వాయర్‌ను విస్తరించే ప్రణాళికలను శరవేగంగా ముందుకు తీసుకుపోతుండగా, ఇప్పుడు మరో రెండు రోడ్కమ్ చెక్‌డ్యామ్‌లను నిర్మించేందుకు సిద్ధమైంది. రూ.397.50 కోట్ల బడ్జెట్‌తో చేపట్టనున్న చెక్‌డ్యామ్‌లకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా పూర్తిచేసింది. అయినప్పటికీ తెలంగాణ సర్కారు ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. కుంబలనూర్-చికలపర్వి, మంత్రాలయం-చిన్నమంచాల వద్ద ఈ బరాజ్‌లను నిర్మించనున్నది. వీటి నీటి నిల్వ సామర్థ్యం 0.34 టీఎంసీలుగా నిర్ణయించింది. అంతేకాదు ఆయా బరాజ్‌ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళికలను రూపొందించింది.
బరాజ్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ ఇటీవల ఏపీని సైతం సంప్రదించింది. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కారు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తే శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహాలు తగ్గిపోతాయి. వెరసి తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుంది. రాష్ట్ర సర్కారు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంపై నీటిరంగ నిపుణుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.