Congress | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): గ్యారెంటీలు కాటగలిసాయి, వారెంటీలు మంటగలిసాయి. కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంటే ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ సోకాల్డ్ వ్యూహకర్త, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. పైగా అదేదో ఘనతైనట్టు బస్సులు పెడతాం.. కర్ణాటకకు వచ్చి చూడండి అని తెలంగాణ నేతలను సిగ్గువిడిచి ఆహ్వానించారు. “కర్ణాటకలో మేం ప్రతి రైతుకు 5 గంటల కరెంట్ ఇస్తున్నాం’ (వీ ఆర్ గివింగ్ 5 అవర్స్ పవర్ టు ఎవ్రీ ఫార్మర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక) అని శివకుమార్ శనివారం తాండూరు రోడ్‌షోలో ప్రజల సాక్షిగా స్వయంగా వెల్లడించారు. “7 గంటల కరెంట్ ఇస్తామనుకున్నాం.. కానీ ఇవ్వలేకపోయాం. అందుకు కారణం గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం” అని ఆయన తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అదే సమయంలో 5 గంటల కరెంటేదో గొప్పైనట్టు తెలంగాణ నేతలు అక్కడికి వచ్చి చూడాలని, కావాలంటే బస్సులు పెడతామని అన్నారు.
తెలంగాణలో రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను ఇస్తున్న సంగతి శివకుమార్‌కు తెలుసో లేదో! లేకుంటే ఆయన కూడా రాహుల్, ప్రియాంక లాగా ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని చదివారో! శివకుమార్ 5 గంటలు అని చెప్పినప్పటికీ, అక్కడ ఆ మాత్రం కరెంటు కూడా రావడం లేదు. కర్ణాటక తీవ్రమైన విద్యుత్తు కొరతతో సతమతమవుతున్నది. రైతులు ట్యాంకర్లు తెచ్చుకొని పంటలు ఎండిపోకుండా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ తమను మోసం చేసిందని, ఆ పార్టీకి ఓటువేసి మీరు మోసపోవద్దని కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి మరీ ధర్నాకు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో కూడా శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై అమలుపై రేపు ఏర్పడబోయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ (కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ కం. దే విల్ డిసైడెడ్ 6 గ్యారెంటీస్) అని శివకుమార్ అన్నారు. తద్వారా ఆ గ్యారెంటీల అమలుపై తానే సందేహాలు లేవనెత్తారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలు ఇచ్చిన సంగతి తెలిసిందే! ఆ హామీలు అమలుకావడం లేదని జాతీయ పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి.. తర్వాత చేస్తున్నది మరొకటి అని కర్ణాటక ప్రజలు కూడా కాంగ్రెస్‌ను దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై శివకుమార్ తనంతతానుగానే అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. కర్ణాటకలో కరెంట్ కష్టాలున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటం లేదని, ఇక్కడా అదే పరిస్థితి ఎదురవుతుందని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న వాదన నిజమేనని డీకే శివకుమార్ మాటలే నిరూపించాయి.