కరీంనగర్: రాష్ట్రంలో మున్సిపల్టీలు, కార్పొరేషన్ల పాలకమండల్ల గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు (Sunil Rao) బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతోపాటు 5 నుంచి 8 మంది కార్పొరేటర్లు కూడా కమలం గూటికి చేరనున్నారు. ఈ నెల 28తో కార్పొరేషన్ పాలకర్గం పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ మారడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లు పదవులు అనుభవించి పార్టీని వీడటంపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, లోక్‌సభ ఎన్నికల సమయం నుంచి బీఆర్ఎస్తో ఆయన అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. దీంతో పార్టీ మారడం ఖయమంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నది. ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నారు.
గత ఐదేండ్లుగా తనకు మద్దతు పలికిన కరీంనగర్ నగర ప్రజలకు సునీల్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ నగర కార్పొరేటర్లు, నాయకులు, తన అభిమానులు, మద్దతుదారులకు ధన్యవాదాలు చెప్పారు.