కరీంనగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో కరీంనగర్ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. 50 ఏండ్లు పాలించిన పాలకులు నగర అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అనతికాలంలో కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందిందని, ఇప్పటికే కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని, మానేరు రివర్ ఫ్రంట్‌కు సెప్టెంబర్ 15 వరకు గేట్లు బిగిస్తామని, బోటింగ్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఆదివారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఫౌంటెయిన్ పిట్స్ తవ్వకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ పూర్తయితే దేశంలోనే గొప్ప నగరంగా కరీంనగర్‌కు పేరు వస్తుందని తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం కేబుల్ బ్రిడ్జిపైకి వచ్చి మానేరు అందాలను ఆస్వాదించే సందర్శకుల తాకిడి పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నదని మంత్రి గంగుల చెప్పారు. ప్రతి శని, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా భారీ వాహనాలను అనుమతించబోమని తెలిపారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఆహ్లాదాన్ని కూడా పంచాలనే లక్ష్యంతో ఈ రెండు రోజులు ‘వీకెండ్ మస్తీ’ పేరుతో ఎంటటైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చే శనివారం నుంచి కొనసాగిస్తామని వెల్లడించారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో మిగిలిన రోడ్ల నిర్మాణానికి రూ.16.10 కోట్లు విడుదలయ్యాయని, సెప్టెంబర్‌లో వీటి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నగరంలో రూ.132 కోట్లలో రూ.125 కోట్లతో చేపట్టిన మిగిలిన రోడ్లకు ఈ నెల 18న శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. సమావేశంలో నగర మేయర్ వై సునీల్‌రావు, బీఆర్ఎస్నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్ల శ్రీలత పాల్గొన్నారు.