Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20 ( నమస్తే తెలంగాణ )/వేములవాడ రూరల్ : సిరిసిల్ల పాడిరైతుల పోరాటంతో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. సుమారు 20 వేల మందికి జీవనాధారమైన అగ్రహారం పాలశీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంపై గురువారం పాడి రైతులు భగ్గుమన్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వందలాది మంది రైతులు సుమారు 3 గంటలకుపైగా రాస్తారోకో నిర్వహించారు. రాత్రి సమయంలో గ్రామాల్లోని పాలకేంద్రాల వద్ద నిరసనలకు దిగారు. పలుచోట్ల పాలు పారబోసి రైతు కుటుంబాలు ఆందోళనలకు దిగారు. ఆఖరికి రైతుల పోరాటంతో దిగొచ్చిన అధికారులు.. రాత్రి 9 గంటలకు మళ్లీ పాలకేంద్రాన్ని తెరిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చంద్రగిరి పంచాయతీ పరిధిలోని అగ్రహారం వద్ద కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాలశీతలీకరణ కేంద్రాన్ని అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే సీజ్‌చేశారు. ఇది అధికార యం త్రాంగం కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని, అధికార పార్టీ నేతల కనుసైగతోనే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినదించారు. మూడు గంటలపాటు ధర్నా చేయగా, అరకిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఆర్డీఏ శేషాద్రి వారిని సముదాయించే ప్రయ త్నం చేయగా.. ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే పాల కేంద్రాన్ని ఎలా సీజ్ చేస్తారని అధికారులను నిలదీశారు. ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేస్తున్నామని, విజయ డెయిరీకి పోయాలని ఆర్డీవో రాజేశ్వర్ సూచించగా, రైతులు మండిపడ్డారు. బయటనైనా పారబోస్తాంగానీ, విజయ డెయిరీకి పోసేది లేదని తేల్చిచెప్పారు. రాజకీయ కక్షతోనే అధికారులు తమ పాలకేంద్రాన్ని సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని రైతులను పోలీసులు ఈడ్చుకెళ్లి రోడ్డుపక్కన పడేసి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
పాడి రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు దిగిరాక, అధికార పార్టీ నేతలు నోరెత్తక పోవడంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. సీజ్ చేసిన విషయం తెలుసుకున్న వందలాది మంది పాడి రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఊరూరా ఉన్న పాలకేంద్రాల వద్ద ఎక్కడికక్కడ రాత్రివేళ ఆందోళనకు దిగారు. చాలా చోట్ల రైతులు తమ పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శుక్రవారం నాటికి ఆందోళన మరింత తీవ్రం చేయాలని, కలెక్టరేట్‌ను ముట్టడించాలని రైతులు నిర్ణయించారు. రాత్రి 9 గంటలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో పంచాయతీ కార్యదర్శి సీజ్‌ను తొలగించి.. చిల్లింగ్ సెంటర్‌ను తెరిపించారు. ఇది ఇలాగే కొనసాగుతుందా? లేదా మళ్లీ రైతుల ఆగ్రహం చల్లబడగానే మళ్లీ సీజ్ చేస్తారా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పాడి రైతులకు సేవలందిచాలన్న లక్ష్యంతో కరీంనగర్ డెయిరీ వేములవాడ రూరల్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని అగ్రహారం వద్ద 2005లో మిల్క్ చిల్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ స్థలాన్ని, షెడ్డునూ డెయిరీ సొంతంగా ఏర్పాటుచేసింది కాదు. 2005లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వేలం వేయగా, ఆ వేలంలో డెయిరీ దానిని కొనుగోలు చేసింది. ఆ మేరకు చిల్లింగ్ కేంద్రానికి అవసరమయ్యే విధంగా వసతులు, యంత్రాలను సమకూర్చుకొని కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ఈ చిల్లింగ్ కేంద్రాన్ని నడుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 145 గ్రామాల నుంచి పాలను సేకరిస్తున్నారు. నిత్యం 48,000 లీటర్లను సుమారు 20 వేల మంది పాడి రైతు కుటుంబాల నుంచి సేకరించి, వాటిని చిల్లింగ్ చేస్తున్నారు. 20 ఏండ్లుగా ఈ ప్రాంత రైతులకు ఈ చిల్లింగ్ కేంద్రం సేవలందిస్తున్నది. దీంతో ఈ జిల్లాలో వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నది.
రెండురోజుల క్రితం మిల్క్ చిల్లింగ్ కేంద్రం ప్రహరీ ముందు భాగాన్ని కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా అడుగు ముందుకొచ్చిదని చెప్పారు. అయితే గోడకు ముందు ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. దానికి రెండు అడుగుల వెనక్కి ఈ ప్రహరీ ఉన్నది. ట్రాన్స్ఫార్మర్ను అలాగే ఉంచి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే ప్రహరీని కూల్చివేశారు. ఎందు కు కూల్చివేశారో చెప్పాలంటూ డెయిరీ సిబ్బం ది అధికారులను అడిగినా నేటివరకు లిఖితపూర్వకంగా సమాధానమే చెప్పలేదు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం వేములవాడకు చెందిన మున్సిపల్ అధికారులు, జిల్లా పంచాయతీ, పరిశ్రమ అధికారులు వచ్చి ఏకంగా కేం ద్రాన్నే సీజ్‌చేశారు. ఎందుకు సీజ్ చేస్తున్నారో చెప్పాలని అక్కడి సిబ్బంది ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. ‘కొంత గడువు ఇవ్వండి. 20 వేల లీటర్ల పాలు ఉన్న ట్యాంకర్ లోపల ఉన్నది. వాటిని తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వండి’ అని కోరినా ఏమాత్రం పట్టించుకోకుండానే సీజ్ చేశారు. ఈ విషయంపై తీవ్ర విమర్శలు రావడంతో తర్వాత మళ్లీ ట్యాంకర్‌ను బయటకు పంపించడం గమనార్హం.
ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, కనీస సమాచారం ఇవ్వకుండానే అధికారులు సీజ్ చేశారని డెయిరీ అధికారులు చెప్తున్నారు. తాము నోటీసులు ఇస్తే తీసుకోలేదని, అలాగే చిల్లింగ్ కేంద్రం నడిపేందుకు తగిన అనుమతులు లేకపోవడం వల్ల సీజ్ చేశామని చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి నరేశ్ మీడియాకు వెల్లడించారు. నిర్వాహకులు నోటీసులను తిరస్కరిస్తే.. సదరు నోటీసులను కేంద్రం గోడలపై లేదా గేటుపై అతికించే అవకాశం ఉంటుంది. అనుమతి లేదంటూ అధికారులు పత్రిక ప్రకటన విడుదల చేయవచ్చు. ఇటువంటి చర్య కూడా తీసుకోలేదు. పైస్థాయి అధికారుల ఒత్తిళ్లకు లోనై నోటీసులు తిరస్కరించారని అబద్ధాలు చెప్తున్నారనేది స్పష్టమవుతున్నది. 20 ఏండ్లుగా చిల్లింగ్ కేంద్రం నిర్వాహకులు పంచాయతీ కార్యాలయానికి ఏటా పన్ను చెల్లిస్తున్నారు. లోతుగా చూస్తే ఇదంతా అధికార పార్టీ కనుసన్నల్లోనే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.