కరీంనగర్ విద్యానగర్, జూన్ 15 : ఇప్పటివరకు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యుల డెలివరీలు మాత్రమే ప్రభుత్వ దవాఖానలో జరగ్గా, మొట్టమొదటిసారిగా కరీంనగర్ కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన (జీజీహెచ్)లో సర్జరీ చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్ పమేలా సత్పతి కొంతకాలంగా తీవ్ర తలనొప్పి, ముకు దిబ్బడ, నాసిక అడ్డంకి, సైనసైటిస్, శ్వాస ఇబ్బందితో బాధపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలో ఆదివారం ఆమె అత్యవసర ‘ఎండోసోపీ నాజల్ సర్జరీ, సెప్టో ప్లాస్టి’ని చేయించుకున్నారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జీ వీరారెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేశారు.
కలెక్టర్కు మంత్రి అభినందన
ప్రభుత్వ దవాఖానలో శస్త్రచికిత్స చేసుకుని స్ఫూర్తిగా నిలిచిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. కలెక్టర్ నిర్ణయం ఆమె చురుకైన న్యాయకత్వాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. చికిత్స చేసిన వైద్యులను అభినందించారు.