హైదరాబాద్, ఏప్రిల్5 (నమస్తే తెలంగాణ): కరీంనగర్, ఖమ్మం లోక్సభ టికెట్లను కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు ఇవ్వాలని, ఇవ్వకుంటే బీసీలమంతా కలిసి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. బీసీ నేతలకు సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. పాంచ్ న్యాయ్ పేరిట మ్యానిఫెస్టో తీసుకొస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో మాత్రం సామాజిక న్యాయాన్ని మాత్రం పాటించడం లేదని తెలిపారు. బీసీ, దళిత ఉద్యమకారులు, ప్రజాస్వామిక శక్తులు, సివిల్ సొసైటీ మద్దతుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గద్దెనెక్కాక మాత్రం ఆయా వర్గాలను సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విస్మరిస్తున్నదని విమర్శించారు.