కరీంనగర్: ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు పెట్టాలని, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ఓట్లో చోరీ కంటే ముందు జగిత్యాలలో సీట్ల చోరీ గురించి మాట్లాడాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు కౌంటర్ ఇచ్చారు. దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలిచారన్న పీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కరీంనగర్ ఓటర్లను మహేష్ గౌడ్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. వార్డు మెంబర్‌గా కూడా మహేష్ గౌడ్ గెలవలేరని విమర్శించారు. అసలు మహేష్ గౌడ్‌ను కరీంనగర్ ప్రజలు గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. ఒక్కసారి కూడా గెలవని ఆయనకు ఓట్లచోరీ గురించి ఎలా తెలుస్తుందన్నారు. తాను 30 ఏండ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని, తాను రెండు లక్షల మెజారిటీతో గెలిచానని చెప్పారు. 8 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లను అవమానించారన్నారు.
పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రద్దు చేసి ఓట్లని సరిచేసి మళ్లీ ఎన్నికలకు పోయే సత్తా ఉందా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు రాళ్లతో కొట్టే స్థితికి దిగజారారు. ప్రజలను కలువకుండా రాత్రి పూట పాదయాత్ర చేయడం ఏంటని విమర్శించారు. కరీంనగర్లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయి. అయినా కూడ కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించలేకపోయింది. బీసి రిజర్వేషన్లు ఇవ్వాలని అడిగితే ముస్లీం రిజర్వేషన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.