హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కరాచీ బేకరీపై మతోన్మాద, అరాచకశక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా కుల, మతాలకు అతీతంగా దేశంమొత్తం ఐక్యంగా నిలబడి సైన్యానికి మద్దతుగా నిలబడిన సందర్భంలో ఇలాంటి చర్యలు అనైతికతకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు.
దేశ విభజన సమయంలో పాకిస్థాన్ కరాచీ నుంచి వచ్చిన హిందువుల కుటుంబం దేశవ్యాప్తంగా కరాచీ పేరుతో బేకరీలను ఏర్పాటు చేసి ఏండ్ల తరబడి నడిపిస్తున్నదని ఆయన వివరించారు. మతోన్మాదులు పాకిస్థాన్ నగరం పేరు ఉందని, ఈ అరాచకానికి పాల్పడటం ఆక్షేపణీయమని ఆయన తెలిపారు. ఇలాంటి చర్యలకు తావివ్వకుండా నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.