హైదరాబాద్, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): పత్తి విక్రయాలకు సంబంధించి ఏర్పాటుచేసిన ‘కపాస్ కిసాన్’యాప్‌ను 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తాను కోరారు. ఈ మేరకు శనివారం ఆయనతో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. పత్తి అమ్మేందుకు స్లాట్ బుకింగ్ కోసం ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కపాస్ కిసాన్ యాప్ కేవలం రాత్రి 10 గంటల సమయంలో మాత్రమే ఓపెన్ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నట్టు చెప్పారు.
అదేవిధంగా జిన్నింగ్ మిల్లర్లు, రైతుల విన్నపం మేరకు ఎల్1, ఎల్2, ఎల్3 మిల్లులను వెంటనే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తేమ 20 శాతం ఉన్నప్పటికీ పత్తి కొనుగోలు చేయాలని, ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలు నిబంధనను ఎత్తివేసి గతంలో మాదిరిగా 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని విజ్ఞప్తిచేశారు. మొంథా తుఫాన్‌తో జరిగిన పంట నష్టంపై సర్వే నివేదిక వివరాలు వెంటనే అందించాలని మంత్రి తుమ్మల వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు.