గద్వాల : వంద రోజుల కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కంటి వెలుగు సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని గర్భిణులకు రక్తహీనత నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కిట్స్‌ను అందజేసిందని తెలిపారు.
కంటిచూపుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా కంటి వెలుగు అనే బృహత్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని పేర్కొన్నారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, 87 మున్సిపల్ వార్డుల్లో ప్రజలకు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
కంటి వెలుగు ప్రారంభం నుంచి చివరి వరకు వందరోజుల పాటు ఉత్తేజంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ఆహార పోషక లోపాల వల్ల అంధత్వం వస్తుందన్నారు. సమావేశంలో ఎంపీ రాములు, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.