నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూసేకరణకు రైతుల నుంచి తీవ్ర నిరసన సెగ తగులుతున్నది. తమ పంట భూములు ఇవ్వబోమంటూ రైతులు తెగేసి చెప్తున్నారు. సోమవారం పోలీస్ పహారాలో అధికారులు తొలిదశ పంప్‌హౌస్ నిర్మాణానికి సర్వే నిర్వహించారు. అడ్డుపడిన రైతులను నిర్బంధించారు.
మక్తల్, ఫిబ్రవరి 17 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేకు రైతుల నుంచి అడుగడుగునా నిరసన సెగ తగులుతున్నది. సోమవారం మరోసారి రైతులు పనులను అడ్డుకునేందుకు యత్నించారు. మక్తల్ మండలం కాట్రేపల్లి వద్ద మొదటి దశ పంప్‌హౌస్ నిర్మాణానికి భూసేకరణ కోసం అధికారులు చేపట్టిన సర్వే పోలీసుల పహారాలో కొనసాగింది. సర్వే నిలిపివేయాలని విన్నవించినా పట్టించుకోవడం లేదని పురుగుల మందు డబ్బాతో ఓ రైతు అధికారుల వద్దకు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.
రైతులు సర్వే అధికారుల వద్దకు వెళ్లకుండా నిలువరించారు. తమకు తెలియకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు నిలదీశారు. మక్తల్ తహసీల్దార్ సతీశ్ రైతులతో మాట్లాడారు. భూమి ఎంత పోతుందో తెలుసుకోవడానికే సర్వే చేస్తున్నట్టు చెప్పారు. ఇది ఫైనల్ సర్వే కాదని , ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. పోలీసులే అడ్డుకుంటుంటే సమస్యలు ఎవరికి విన్నవించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.