కరీంనగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉత్తర తెలంగాణలో రైతులు నాట్లు వేసుకోవడానికి సాగునీరు ఇవ్వాలని, కన్నెపల్లి పంపుహౌస్‌ను ఆన్‌చేసి.. నీరు ఎత్తిపోయాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి పేరు వస్తదన్న అక్కసుతో కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయకుండా లక్షలాది మంది రైతుల ఉసురు పోసుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. మేడిగడ్డ బరాజ్ వద్ద 82 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుందని తెలిపారు. సాగునీటిరంగ నిపుణులు, ఇంజినీర్ల సూచనల ప్రకారం మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తి పోయడానికి 93.5 నుంచి 94 మీటర్ల ప్రవాహం ఉంటే సరిపోతుందన్నారు.
రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసి, ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులను నింపుకోవడానికి ఆస్కారం ఉన్నదని తెలిపారు. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు ఎత్తిపోయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభ్యంతరం తెలుపలేదని గుర్తుచేశారు. ఎల్లంపల్లి-మధ్యమానేరు-దిగువ మానేరు- మల్లన్నసాగర్- కొండపోచమ్మ రిజర్వాయర్‌తో పాటు ఎగువమానేరు వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశముందని చెప్పారు. ఎస్సారెస్పీ పునర్జీవం ద్వారా వరదకాలువను నింపి, ఈ పరిధిలోని అన్ని చెరువులను నింపడానికి పుష్కలమైన అవకాశాలున్నాయని స్పష్టంచేశారు. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తే.. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే కాంగెస్ ప్రభుత్వం ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. రైతుల జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడిందని వినోద్ ఆవేదన వ్యక్తంచేశారు.