కన్నాయిగూడెం, మే 15 : తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలానికి చెందిన మావోయిస్టు నేత సాదపల్లి చందూ అలియాస్ రవి(25) మృతి చెందాడు. ఏటూరు గ్రామానికి చెందిన అన్నపూర్ణ-వెంకటేశ్వర్లు (తండ్రి లేట్) దంపతులకు రాజు, చందు ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన చందు భద్రాచలంలోని ఓ వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న సమయంలో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై రెండు సంవత్సరాల క్రితం మావోయిస్టు పార్టీలో చేరాడు. బెటాలియన్ డాక్టర్ టీమ్ కమాండర్‌గా, కేంద్ర కమిటీ సభ్యుడు దామోదర్‌కు అత్యంత సమీపంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది.
చందుపై రూ.8లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. కర్రెగుట్టల ప్రాంతంలో ఈ నెల 6,7 తేదీల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చందు మృతి చెందాడు. ఈ విషయం తెలియక మృతదేహం కోసం ఎవరూ వెళ్లకపోవడంతో పోలీసులు భద్రపర్చి ఉంచారు. చందు మృతి వార్త గ్రామాన్ని విషాదంలో ముంచింది. గురువారం కుటుంబ సభ్యులు చందు మృతదేహాన్ని ఏటూరుకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు