హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా పూడూరు మండ లం కంకల్ గ్రామంలో నిర్లక్ష్యానికి గురవుతున్న వెయ్యేళ్ల నాటి జైన శిల్పాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, కంకల్ను వారసత్వ గ్రామంగా ప్రకటించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సోమవారం ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశా రు.
50కిపైగా శిల్పాలు పట్టించుకునే నాథుడు లేక చెల్లాచెదురుగా పడిఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాదామీ చాళుక్య కాలపు (క్రీ.శ 8వ శతాబ్ది) నిలువెత్తు గణేశుడి విగ్రహం, నంది శిల్పాలు, రాష్ట్రకూటుల కాలపు (క్రీ.శ 9వ శతాబ్ది) జైన పార్శ్వనాథ, మహావీర, యక్ష, యక్షిణీ శిల్పాలు, కళ్యాణీ చాళుక్యుల కాలపు (క్రీ.శ. 11వ శతాబ్ది) నాగదేవతలు, కాకతీయుల కాలపు సప్తమాతృక, శత్రు సంహారంలో ప్రాణాలొదిన వీరుల శిల్పాలు, రెండు శాసనాలు, ఎండకు ఎండు తూ, వానకు తడుస్తూ పాడైపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా పార్శ్వనాథుడు, యక్ష, యక్షిణీ శిల్పాలు, వర్ధమానమహావీరుని తల, మొండెం భిన్నమైన శిల్పాలు, సింహం బొమ్మలతో చెకిన శిల్పం, అతి పెద్ద వర్ధమాన మహావీరుని శిల్పం పీఠం తదితర శిల్పాలు రాష్ట్రకూటుల శిల్పశైలికి అద్దం పడుతున్నాయని చెప్పారు.