ఆదిలాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ను కంది శ్రీనివాస్‌రెడ్డికి ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. 15 ఏండ్లుగా పార్టీ జెండాను మోస్తున్న వారిని కాదని ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కంది శ్రీనివాస్‌రెడ్డికి అభ్యర్థిత్వం ప్రకటించవద్దంటూ నిరసన చేపట్టారు. అధిష్ఠానం గతంలో ప్యారాచూట్ నేతలకు టికెట్ ఇచ్చేది లేదని చేసిన తీర్మానానికి కట్టుబడి ఉండాలని కోరారు. కందికి టికెట్ ఇస్తే తాము పనిచేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. కంది శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇస్తే ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ పేర్కొన్నారు. పార్టీ జెండా మోసిన నాయకులకే టికెట్ ఇవ్వాలని కోరారు.