హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కందాడై రామానుజాచార్యులు(82) ఆదివారం తుది శ్వాస విడిచారు. బీఏ లిటరేచర్ చదివి డాక్టరేట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఆయన టీటీడీ దేవస్థాన కళాశాలలో లెక్చరర్, ప్రిన్సిపాల్‌గా, బోర్డు మెంబర్‌గా సేవలు అందించారు. భగవత్ విషయాన్ని, శ్రీ భాష్యాన్ని విషదీకరించడంలో ప్రావీణ్యం కలిగిన ఆయన హరివంశ మహాపురాణం వంటి ఎన్నో గ్రంథాలు రచించారు.
అభినవ వ్యాస ప్రవచన వారధి, ప్రవచన శిరోమణి, వేద విభూషణ, జ్యోతిర్ విజ్ఞాన భాస్కర జ్ఞాన సరస్వతి వంటి బిరుదులు ఆయనకు దక్కాయి. ఆన్లైన్ వేదికగా విదేశాల్లోని విద్యార్థులకు కూడా విద్యాభోదన చేస్తున్నారు. న్యూనాగోల్‌లో ఉన్న ఆయన నివాసానికి వైష్ణవ సేవా సంఘం సభ్యులు, పలు ఆలయాల ప్రధాన అర్చకులు దేవనాథ స్వామి, వేణుస్వామి, కందాళ రత్నమాచార్యులు, మాజీ ఎంపీ వేణుగోపాలచారి వంటి ప్రముఖులు సంతాపం ప్రకటించి, కుటుంబసభ్యులను ఓదార్చారు.