HCU Lands | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : కంచ గచ్చిబౌలిలోని భూములు, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సమగ్ర వివరణతో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. టీజీఐఐసీ ద్వారా అడవిలోని చెట్లను అక్రమంగా తొలగించినట్టు, అక్కడి వన్యప్రాణులు, సరస్సులు, ప్రత్యేక రాతి శిలలకు నష్టం జరిగినట్టు మీడియా కథనాల్లో చూశామని పేర్కొంది.
ఈ విషయంపై పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని, న్యాయస్థానాల ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూడాలని స్పష్టంచేసింది. ఈ అంశంపై వాస్తవ నివేదికతోపాటు, తీసుకున్న చర్యల వివరాలను పంపించాలని కేంద్రం ఆదేశించింది.