హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో జరుగుతున్న తతంగమంతా చెరువుల పరిరక్షణ కోసం కాదని పైసా వసూలే ప్రధాన లక్ష్యమని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారు. పేదోళ్లను కొట్టి పెద్దోళ్ల దగ్గర వసూలు చేయడానికే పక్కా ప్లాన్‌తోనే సర్వేల మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్లో చెరువుల ఆక్రమణలపై ఇప్పుడు నడుస్తున్నది రాక్స్, లేక్స్, పార్క్స్ కాదని.. డ్యామేజెస్, ప్యాకేజెస్, పర్సంటేజెస్ అని వ్యాఖ్యానించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం హైడ్రా తీరుపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల చెరువుల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తప్పుబట్టారు.
గత 14 ఏండ్లలో కేవలం 229 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తే.. కేవలం ఒక్క సెప్టెంబర్ నెలలోనే 95 చెరువులకు ఎలా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వగలిగారని ప్రశ్నించారు. కేవలం గత ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని అన్నారు. మూడుజిల్లాల్లో ఉన్న చెరువులను తగ్గించి దానికి హద్దులు నిర్ధారించి హైడ్రా ఏర్పాటైన తర్వాత ఆక్రమణలుగా చూపించడంతో రాత్రికిరాత్రే సూట్‌కేసులు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. తమ పరిశీలనలో ఇప్పటివరకు 30 బడా కంపెనీల ప్రాజెక్టులు ఈ ఆక్రమణల్లో ఉన్నట్టుగా తేలిందని, వీటకి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడ్తామని చెప్పారు. 2014కు ముందు పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలు జరగలేదా? అని ప్రశ్నించారు.
అధికారులకు శిక్ష ఏది?
చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అదికారులను, అందుకు ప్రోత్సహించిన రాజకీయ నాయకులను పట్టుకోరు కానీ సామాన్యప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్టేనా అని వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. పేదోళ్ల ఇండ్లు కూలగొట్టి శ్మశానం చేస్తున్న రేవంత్‌రెడ్డి .. ప్రజాపాలన అంటే ఇదేనా అని నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షల కోట్ల విలువ చేసే అనేక స్థలాలు కబ్జాకు గురయ్యాయని, వీటిలో కంపెనీలు ఏర్పాటు చేసుకొనేందుకు విదేశీయులకు రేవంత్ సర్కార్ అనుమతులు ఇచ్చిందని తెలిపారు.
భట్టి పీపీటీ లోపభూయిష్టం
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెరువుల ఆక్రమణలపై చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అంతా లోపభూయిష్టమని వెంకటరమణారెడ్డి విమర్శించారు. మొత్తం 171 ఆక్రమణల గురించి చెప్తూ.. ఎకరం, రెండెకరాలు, పదెకరాలలోపు చెరువులే చూపించారు తప్ప వందల ఎకరాల చెరువుల ఆక్రమణలపై ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. కొన్నిచెరువుల పేర్లు, ఐడీలు మార్చారని ఇంకొన్నిచోట్ల చెరువులే మాయమయ్యాయని, ఇవన్నీ ఎందుకు తన ప్రజెంటేషన్‌లో భట్టి వివరించలేదని అన్నారు. మేడ్చల్ జిల్లాలో 127 ఎకరాల రాంపల్లి చెరువును కాకుండా సీనుగున్కుంట అని 0.39 ఎకరాలుగా చూపించారని తెలిపారు. ప్రెస్‌మీట్ కేవలం తన వ్యక్తిగతమని, ఎవరికీ సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రమణారెడ్డి వెల్లడించారు.