పెద్దపల్లి, ఆగస్టు 20: కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని నిలబెట్టుకొ ని, వెంటనే సమగ్ర కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళ వారం పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అధ్యక్షతన బీసీ సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ‘సమగ్ర కులగణన చేపట్టాలి లేదా సీఎం రేవంత్‌రెడ్డి కుర్చీ అయినా ఖాళీ చేయాలి’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ‘స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా రాష్ట్రంలో బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయిండా? అని ప్రశ్నించారు.
ఓట్లు బీసీలవీ, సీట్లు అగ్రవర్ణాలవా?, ఎందుకీ వివక్ష?, బీసీలకు రాజ్యాధికారం వద్దా?, ఇంకెన్నాళ్లీ కష్టాలు, కన్నీళ్లు, బానిస బతుకులు, ఇకనైనా తెగబడుదాం.. కలబడుదాం.. నిలబడుదాం, ఐక్యతతో పోరాటాలు చేస్తూ రాజ్యాధికారం చేపట్టే దిశగా అడుగులు వేద్దామని’ పిలుపునిచ్చారు. అధికారంలో వచ్చిన ఆరు నెలల్లో సమగ్ర కులగణన చేపడుతామని నమ్మించి, బీసీ ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం, తొమ్మిది నెలలైనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయడం లేదని విమర్శించారు. భావితరాల కోసమైనా సమగ్ర కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం, 26న కలెక్టరేట్ల ముట్టడి, వచ్చే నెల 9న కులగణన మార్చ్ నిర్వహిస్తామని వెల్లడించారు.