హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ ప్రహసనం కొలిక్కిరాకపోగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పలు పరిణామాలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. అధిష్ఠానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు హస్తినకు క్యూకట్టిన నేపథ్యంలో ఇప్పుడు ‘రంగారెడ్డి’ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అంశం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మంత్రిపదవి ఇవ్వాలంటూ అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ పేరుతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి లేఖ రావడమే ఇందుకు కారణం. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ విషయం కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇటీవల మంత్రిపదవిపై గట్టిగా పట్టుబడుతున్న సదరు ఎమ్మెల్యే అధిష్ఠానంపై కూడా ఒత్తిడి పెంచుతున్నారు. ఆ నాయకుడికి బెర్త్ కోసం నిజంగానే కమలాహారిస్ ఏఐసీసీకి లేఖ రాశారా? లేకపోతే ఫేక్లెటరా అనే కోణంలో రాహుల్‌గాంధీ కార్యాలయం ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. అటు లేఖతో తనకు సంబంధంలేదని, ఐదేండ్లుగా తాను అమెరికాకే పోలేదని సదరు ఎమ్మెల్యే సన్నిహితవర్గాలు, మీడియాకు చెప్తున్నారు. తనకు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో మంచి పరిచయం ఉందని, తాను ఎకడి నుంచో పైరవీ చేయించుకోవాల్సిన అవసరంలేదని అంతర్గత సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. ‘రంగారెడ్డి’ జిల్లాకు చెందిన సదరు ఎమ్మెల్యేకు పదవి రాకుండా రాద్ధాంతం చేయడానికి పార్టీలో గిట్టనినేతలే లేఖను సృష్టించారా అనే అనుమానాలను కూడా కొందరు కాంగ్రెస్ నేతలు వ్యక్తంచేస్తున్నారు.