AIIMS | యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో కామకేళి బాగోతం బయటకు వచ్చింది. ఇటీవల ఘటన జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టింది. భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళకు ప్లేట్లెట్లు తగ్గడంతో ఈ నెల 10న అర్ధరాత్రి బీబీనగర్ ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆమె బంధువులు బిల్డింగ్ బయట నిరీక్షించారు. అయితే.. పైన ఓ రూమ్‌లో స్త్రీ, పురుషుడు రాసలీలల్లో తేలిపోయారు. రూమ్ అద్దాలు పూర్తిగా తీసి ఉండటంతో అసభ్యకర దృశ్యాలు బయటకు స్పష్టంగా కనిపించాయి.
దాంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఆ సమయంలో అక్కడున్న సెక్యూరిటీ గార్డు వీడియో ఎందుకు తీస్తున్నావంటూ అడ్డుతగిలే ప్రయత్నం చేస్తూ.. ఇదంతా సహజమేనంటూ నిర్లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. కొందరు వైద్య విద్యార్థులు కిందకొచ్చి.. సెల్ఫోన్లో రికార్డు చేసిన వీడియో డిలీట్ చేసి, క్షమాపణలు చెప్పాలని హెచ్చరించినట్టు తెలిసింది. దాంతో కొందరు రోగి బంధువులు ఎదురు తిరగడంతో వారు తిరిగి వెళ్లిపోయినట్టు సమాచారం. ఇదే విషయంపై ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియాతోపాటు అధికారులను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.