Srisailam | శ్రీశైలం : ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద కామదహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆలయంలో శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో మనోహర గుండం ఎదురుగా వేంచేబు చేయించి విశేషపూజలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ నిర్వహించబడింది. ఈ పల్లకీసేవలోనే ఉత్సవమూర్తులు గంగాధర మండపం వరకు తోడ్కొని వచ్చి శాస్త్రోక్తంగా పూజదికాలు జరిపించిన తరువాత సాంప్రదాయాన్ని అనుసరించి మన్మథ రూపాన్ని దహనం చేయడం జరిగింది.
కాగా మన్మథుడు శివతపోభంగం చేయగా, కోపించిన పరమేశ్వరుడు మన్మథుడిని ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజే దహించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కామదహనాన్ని నిర్వహించడం సాంప్రదాయమైనది. కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వలన శివకటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు కె. శివప్రసాద్ స్వామి, ఎం. పూర్ణానందఆరాధ్యులు, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.