హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ దరఖాస్తుదారులు సర్కారు సాయం కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులకు ఆర్థికసాయం అందకుండా పోతున్నది. వివాహం చేసుకునే నిరుపేద ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో ఆడబిడ్డ కల్యాణానికి 1,00,016 చొప్పున నగదు అందజేసే ఈ పథకాల అమలుకు బీసీ సంక్షేమ శా ఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది.
ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకునేవారు తమ పెండ్లి పత్రిక లేదా మ్యారేజ్ సర్టిఫికెట్తో ఆన్లైన్లో సీజీజీ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులపై మండల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అర్హుల దరఖాస్తులను ఆమోదించాలి. ప్రస్తుతం దాదాపు 49 వేల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన 1.2 లక్షల దరఖాస్తుల్లో 80,500 దరఖాస్తులు ఎ మ్మార్వో కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ పూర్తయినవి 39,500 మాత్రమే. వీ టి లో 29వేల దరఖాస్తులు ఆర్డీవోల వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆర్డీవోల పరిశీలన పూర్తయిన 10,500 దరఖాస్తుల్లో సగం దరఖాస్తులకు ఇప్పటికీ చెక్కులు మంజూరు కాలేదు. దీంతో ఆ ర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.