కోనరావుపేట, ఫిబ్రవరి 3 : ‘కల్యాణ లక్ష్మికి కాలంచెల్లిందంట!’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో కథనం ప్రచురితంకాగా, తమకు కూడా కాలంచెల్లిన చెక్కులు ఇచ్చారంటూ మంగళవారం మరో ఆరుగురు లబ్ధిదారులు తమగోడు వెల్లబోసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల జనవరి 20న రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో కల్యాణలక్ష్మి పథకం కింద 106మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెకులు పంపిణీ చేశారు. ఈ చెకులు నిరుడు అక్టోబర్ 29న మంజూరైనట్టు తెలుస్తున్నది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో గడువు ముగియడానికి పది రోజుల ముందు లబ్ధిదారులకు అందజేశారు.
లబ్ధిదారులు వెంటనే బ్యాంకుల్లో చెకులను జమచేసినప్పటికీ వాటి గడువు ముగిసిపోయిందని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు ఫోన్ చేసి చెకులు చెల్లుబాటు కావని, తిరిగి తీసుకెళ్లాలని సూచించడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నిమ్మపల్లి, వట్టిమల్లలో ఇద్దరు చొప్పున, మంగళ్లపల్లి, శివంగాళపల్లిలో ఒక్కొక్కరు చొప్పున లబ్ధిదారులు తమకు డబ్బులు జమ కాలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ తహసీల్ కార్యాలయలో చెక్కులు తిరిగి ఇచ్చారు. రానున్న రోజుల్లో మరిన్ని ఘటనలు బయటికి వచ్చే అవకాశం ఉన్నది.