కల్వకుర్తి, అక్టోబర్ 17 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతీకార పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. పాలన గాలికొదిలి ఢిల్లీకి డబ్బుల సంచులు మోయడంలో ముఖ్యమంత్రి, సెటిల్మెంట్లు, వసూళ్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. కల్వకుర్తి పట్టణంబలోని గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల వెంకటేశ్‌తో కలిసి పరిశీలించారు. గత 35రోజులుగా సమ్మె చేస్తున్న దినసరి వేతన కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.
వంటవాళ్లు లేక ఆకలిబాధతో అలమటిస్తున్న విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గురుకులాలను స్థాపిస్తే, ఇప్పుడు రేవంత్ సర్కార్ గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. జీతాలు పెంచాలని వంట కార్మికులు సమ్మె చేస్తుండటంతో ప్రత్యామ్నాయ వనరులు చేట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అల్లాడిపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం, మంత్రుల మధ్య పంచాయితీ తారాస్థాయికి చేరిందని ఆర్ఎస్పీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.