Rythu Deeksha | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొడంగల్ : కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నేడు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతు దీక్ష చేపట్టినట్టు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కొడంగల్‌లో బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందని, రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు అద్భుతమైన సంక్షేమ ఫలాలు అందుకొని సంతోషంగా పంటలు పండించి తెలంగాణను అన్నపూర్ణగా మార్చినట్టు గుర్తుచేశారు. ఎన్ని విపత్తులు ఎదురైనా ప్రజలకు, రైతులకు సకాలంలో సంక్షేమ పథకాలు అమలుచేసినట్టు తెలిపారు.
కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ అమలుచేయకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం సాక్షిగా 4 పథకాలను ప్రారంభించిన రేవంత్ సర్కారు.. ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలుచేయడం లేదని ఆరోపించారు. సకాలంలో పెట్టుబడి సాయం అందక రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నట్టు చెప్పారు. అబద్ధపు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్వస్తి పలుకుదామని పిలుపునిచ్చారు. కేటీఆర్ రైతుదీక్షకు రైతులతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ దయాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్‌రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల గిరిజన రైతుల పోరాటానికి ప్రత్యక్షంగా మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. మార్గమధ్యంలో లగచర్ల, రోటిబండతండా రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. వారికి భరోసా ఇవ్వనున్నారు. కేటీఆర్ వస్తుండడంతో గిరిజనుల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజులుగా ఇక్కడ పోలీస్ పహారాలో ప్రభుత్వం భూములను సర్వే చేయిస్తుండడంతో కేటీఆర్ పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వెళ్లనున్నారు.