KTR | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావ్సాలిందేనని.. తెలంగాణ మళ్లీ పట్టాలు ఎక్కాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇంతకు ముందు లెక్క ఉండదని.. అందరి లెక్కలు తేలస్తామన్నారు. రాజేంద్ర నియోజకవర్గానికి చెందిన మాజీ డీసీఎంఎస్ చైర్మన్, మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, ఆయన కుమారుడు పెద్దషాపూర్ మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్, 2018లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన అంజిబాబు దంపతులు తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ఆదివారం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆక్రమణల పేరుతో పేదల ఇండ్లను కూలుతున్నారని.. ఇప్పటివరకు ఒక్క బడా వ్యక్తి ఇంటిని కూల్చలేకపోయిందని.. మూసీకి అడ్డంగా కడుతున్నవారిని ఎవరూ పట్టించుకోవట్లేదని విమర్శించారు. బడా నేతల ఇళ్లు కూల్చివేసేందుకు హైడ్రాకు దారి దొరకడం లేదని.. కానీ, పేదల వద్ద నివాస పత్రాలు ఉన్నా రాత్రికి రాత్రే కూల్చివేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు చెరువులోనే ఉందని.. ఆ ఇంటి జోలికి మాత్రం వెళ్లడం లేదన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి గెస్ట్‌హౌస్ చెరువులో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ ఇళ్లు చెరువులోనే ఉన్నా వాటిని ముట్టుకోవడం లేదని.. కేవీపీ రామచంద్రరావు ఇంటి జోలికి కూడా వెళ్లడం లేదని.. పెద్ద ఇండ్ల అడ్రస్‌లు కూడా హైడ్రాకు తెలియదంటూ సెటైర్లు వేశారు. పేదల ఇళ్లు కూలిస్తే అడిగేవారే లేరని భావిస్తున్నారన్నారు. పెద్దల వద్ద డబ్బులు గుంజి బెదిరింపులకు దిగుతున్నారని.. రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు.
ఈ దిక్కుమాలిన ఆలోచనలు, విధానాలతోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే సీఎం మొదట దెబ్బకొట్టింది రాజేంద్రనగర్ నియోజకవర్గాన్నేనన్నారు. 2023 కేబినెట్ భేటీలో 400 కిలోమీటర్ల మెట్రో మంజూరు చేశామని.. ఎయిర్‌పోర్టు మెట్రోకు టెండర్లు పూర్తి చేస్తే రేవంత్ వచ్చాక రద్దు చేశారని.. తనకు భూములు ఉన్నాయనే అనుమానంతో ఆ పని చేశారని విమర్శించారు. రాజేంద్రనగర్‌లో భూములున్నాయని సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారని.. భూములు చూపితే రాసిస్తానని సబితా ఇంద్రారెడ్డి చెబుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డికి తాను బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. భూములు ఎక్కడున్నాయో చూపించాలని.. కంపెనీలు, భవనాలు నావేనని చెబుతూ రెండేళ్లుగా జల్లెడ పడుతున్నారన్నారు. గత దీపావళికి మంత్రి బాంబులేటి.. బాంబులు పేలుతాయని చెప్పారని.. మళ్లీ దీపావళి వచ్చిందంటూ చురకలంటించారు. బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి తీసుకువెళ్లామని.. కాంగ్రెస్ పాలనలో పారిశ్రామివేత్తలకు తుపాకులు పెడుతున్నారని.. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా దందాలు చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.