నిజామాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బెదిరింపులకు భయపడేదే లేదు.. అలాంటి వారు రాజకీయ నేతలైనా, అధికారులైనా వారి పేర్లను పింక్ బుక్‌లో రాస్తున్నాం.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవన సన్నాహక సమావేశాలకు మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డితోపాటు కవిత హాజరయ్యారు. తొలుత తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించి, గులాబీ జెండాను ఎగురవేశారు. సంగం తండాకు చెందిన ఓ గిరిజన మహిళ బీఆర్ఎస్కు విరాళంగా రూ.2 వేలను అందజేశారు. అనంతరం గులాబీ శ్రేణులను ఉద్దేశించి కవిత ప్రసంగించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు, అధికారులు బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే చాన్స్ లేదని స్పష్టంచేశారు.
తమ కార్యకర్తలను అకారణంగా పోలీస్స్టేషన్లకు ఈడ్చిన వారినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. గులాబీ కండువాను బెదిరిస్తామంటే భయపడేవాళ్లు ఎవ్వరూ లేరని తేల్చిచెప్పారు. బాన్సువాడలో ఉప ఎన్నిక వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీయే మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘బాన్సువాడకు హైదరాబాద్ నుంచి వస్తుండగా దారిలో ఓ తమ్ముడు ప్రేమతో పలుకరించిండి. ఇంకా ఎన్ని రోజులు ఈ దరిద్రం. తొందరగా ఈ ప్రభుత్వాన్ని దించండని ఆ తమ్ముడు అడిగిండు’ అని కవిత తెపారు. 15 నెలల్లోనే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ 15 నెలల్లో మంచికి బదులుగా చెడే ఎక్కువ చేశారని విమర్శించారు. ప్రజలకోసం కాకుండా పైసల కోసం స్థానిక నాయకులు వలసలు పోయారని పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి కవిత పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు ఇంటికొకరు తరలి రావాలని పిలుపునిచ్చారు.
రాళ్ల గుట్టలు, మంజీరాలో ఇసుక, డబ్బులు మాత్రమే పోచారం శ్రీనివాసరెడ్డికి కావాలని, ఆయనకు నిజాయితీ అవసరం లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎద్దేవా చేశారు. రానున్న కాలంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేశారు. పోచారం చెప్పే మాటలు విని పోలీసులు వేధిస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో బాన్సువాడకు కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులిచ్చినా, సిగ్గులేకుండా పార్టీ మారాడని మండిపడ్డారు. సలహాదారుగా నియమితుడై ప్రొటోకాల్ కోసం దిగజారిపోయాడని విమర్శించారు.
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నమ్మకద్రోహి, వెన్నుపోటుదారుడని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ పాలిట కేసీఆర్ దేవుడైతే, బాన్సువాడ పాలిట బకాసురుడు, ప్రజల పాలిట నరకాసురుడు పోచారమని విమర్శించారు. పోచారంను కేసీఆర్ లక్ష్మీపుత్రుడిగా భావిస్తే, శనిపుత్రుడిగా మారాడని మండిపడ్డారు. పార్టీ ఆపదలో ఉన్న సమయంలో పోచారం మరోపార్టీలో చేరి తీరని ద్రోహం చేశాడని మండిపడ్డారు. బాన్సువాడకు పోచారం సౌభాగ్యం కాదని, ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే పోచారంలాంటి విశ్వాస ఘాతకులను ప్రజలు క్షమించరని స్పష్టంచేశారు. బాన్సువాడ నియోజకవర్గం కోసం పోచారం అడిగినన్ని నిధులు కాదనకుండా కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు.