హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రజాకవి కాళోజీ నారాయణరావును నిత్య చైతన్యదీప్తిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాళోజీ చివరి వరకు పరితపించారని కొనియాడారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని కాళోజీ అన్ని వేదికలపై ఎలుగెత్తి చాటారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాళోజీ 111వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కాళోజీ చిత్రపటానికి ఘ నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ ‘అన్యాయాన్ని ఎదిరిస్తే ‘నా గొడవ’కు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినవాడు నాడు ఆరాధ్యుడు’ అని ప్రకటించిన మహనీయుడు కాళోజీ అని పేర్కొన్నారు. కాళోజీ కోరుకున్నది బడిపలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. రెండున్నర జిల్లాలదే భాష గా, తెలంగాణ 10 జిల్లా ప్రజల భాషను యాస గా ఎగతాళిగా మాట్లాడటంపై నాడు కాళోజీ భగ్గుమన్నారని తెలిపారు. కాళోజీ ఆదర్శాలన్నీ తెలంగాణ కవులు, రచయితలకు మార్గదర్శకమని తెలిపారు. వరంగల్‌లో కాళోజీ కళా ప్రాంగణాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని, సాహిత్య అకాడమీ చైర్మన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో సముచిత ప్రాధాన్యం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజాకవి కాళోజీకి సముచిత ప్రాధాన్యం ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నాడు కేసీఆర్ ప్రకటించారని,గుర్తుచేశారు. వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టారని తెలిపారు. కాళోజీ పేరుతో అవార్డును కూడా కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. కాళోజీ పేరిట వరంగల్‌లో అతిపెద్ద కళాక్షేత్రాన్ని కేసీఆర్ నిర్మించారని, దానిని ఇప్పటి కాంగ్రెస్ సరార్ కళావిహీనంగా మార్చిందని మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, పల్లె రవికుమార్‌గౌడ్, వాసుదేవరెడ్డి, చిరుమల్ల రాకేశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీఆర్ఎస్ నాయకులు ఉపేంద్ర, సుమిత్రా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.