చిక్కడపల్లి, మే 14: కల్లు గీత వృత్తిపై బీజేపీ తన వైఖరిని స్పష్టంచేయాలని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్‌గౌడ్ డిమాండ్ చేశారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేటికీ కల్లుగీత వృత్తి నిషేధంలో ఉన్నదని, తద్వారా వృత్తిదారుల ఉపాధి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం చిక్కడపల్లిలోని కమిటీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కర్ణాటకలో జేడీ(యూ) పరిపాలనలో కల్లుగీత వృత్తి ఉన్నదని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆ వృత్తిని రద్దు చేశారని గుర్తుచేశారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కల్లుపై జీఎస్టీ పెట్టాలని ప్రతిపాదించడం దారుణమని, దానిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, వర్కిం గ్ చైర్మన్ ఎలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.