పరిగి, మార్చి 26 : ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాట పట్టారు. కాళ్లాపూర్ నుంచి పరిగికి చేరుకొని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్‌స్టాండ్ వరకు ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడ బైఠాయించారు. కాంగ్రెస్ సర్కార్ తమను రోడ్డుపాలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. భూములు లాక్కుంటే చావే శరణ్యమని స్పష్టంచేశారు. ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకున్న కొద్దిపాటి భూమిని లాక్కుంటే తమ కుటుంబాలు వీధిన పడుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
తమ భూములను సేకరించడం లేదని కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని స్పష్టంచేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూములు పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే తమ ఆవేదనను అర్థం చేసుకోకుండా.. అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. పలువురు రైతులను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా తోపులాట జరిగింది. మహిళా రైతులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసు వాహనాల్లో ఎక్కించిన రైతులను కిందికి దించారు. ఆ తర్వాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ తహసీల్దార్ వెంకటేశ్వరికి రైతులు వినతిపత్రం అందజేశారు. భూ సేకరణ ఉత్తర్వులు వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

తమను అడ్డుకోవద్దని, న్యాయమైన డిమాండ్‌ను అర్థం చేసుకోవాలని ఓ రైతు పరిగి ఎస్ఐ మోహన్‌కృష్ణ కాళ్లు మొక్కారు. రైతులను అరెస్టు చేసి వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తుండగా ఓ వృద్దురాలు ఏడుస్తూ పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి తమ వారిని తీసుకుపోరాదని వేడుకోవడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. రైతులకు కనీసం నచ్చజెప్పేందుకు అధికారులెవరూ రాకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల ఆందోళనతో గంటన్నరపాటు వాహనాలు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ నాయకుడు బీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు మీదిగడ్డ శ్రీనివాస్, బీ రవికుమార్, వారాల రవీంద్ర, నరేశ్, బీజేపీ నాయకులు ముకుంద నాగేశ్వర్, పెంటయ్య గుప్తా, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం వెంకటయ్య పాల్గొని మద్దతు ప్రకటించారు.
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ పరిగి మండలం రాపోల్ గ్రామ రైతులు గ్రామంలో గురువారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూ సేకరణ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.