హైదరాబాద్/పెద్దపల్లి, జూలై 9 (నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి దశదిశలా విస్తరిస్తున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగునీటిని అందించి, రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనుకున్న సీఎం కేసీఆర్ కలను నిజం చేస్తూ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నదీ జలాలు ఎగువకు పయనిస్తూ ఎస్సారెస్పీని చేరుకొని రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాయి. వర్షాభావ పరిస్థితుల్లోనూ తెలంగాణ సాగుభూములకు నీటిని అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత సీఎం కేసీఆర్ దార్శనికత నేడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకెకిన ఇంతటి గొప్ప ప్రాజెక్టును సందర్శించేందుకు దేశవ్యాప్తంగా నీటి రంగ నిపుణులు, పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు, మేధావులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే క్యూ కడుతున్నారు.
ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి ఆకర్షితులై మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్తోపాటు పలు పార్టీల నాయకులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఏ జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల వంశీధర్‌రావు సారథ్యంలో వీరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బరాజ్, లక్ష్మీ పంప్‌హౌస్, అన్నారంలోని సరస్వతీ బరాజ్, పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంప్‌హౌస్, సుందిళ్లలోని పార్వతీ బరాజ్, గోలివాడలోని పార్వతీ పంప్‌హౌస్, ధర్మారం మండలం నంది మేడారంలోని నందిపంప్హౌస్ను సందర్శించారు. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వారికి మ్యాప్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించారు.
కేసీఆర్ దార్శనికతకు కాళేశ్వరమే నిదర్శనం
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు భానుదాసు మార్కుటే, అన్నా సాహెబ్ మానె, నా యకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ఇంతటి అద్భుతమైన ప్రాజెక్టును ప్రపంచం లో ఎక్కడా చూడలేదన్నారు. కాళేశ్వర జలాలను ఎదురెక్కి పారిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అపర భగీరథుడు అని కొనియాడారు. ఆయన దార్శనిక పాలన తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అతి తక్కువ సమయంలో భారీ ప్రాజెక్టులను నిర్మించి దేశానికి సవాల్‌గా నిలిచిందని కితాబిచ్చారు.
కేసీఆర్ పాలనకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్దం పడుతుందని కొనియాడారు. 32 దేశాలను తిరిగిన తాను ఇలాంటి మానవ నిర్మిత అద్భుతాన్ని ఎకడా చూడలేదని భానుదాసు మార్కుటే అన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరని ప్రశంసించారు. బరాజ్, పంప్‌హౌస్‌లను సందర్శించిన వారిలో అహ్మద్‌నగర్ జడ్పీ మాజీ అధ్యక్షుడు అరుణ్ కదూ, ఎన్సీపీ నేత బాలాసాహెబ్ విఖే పాటిల్, మహారాష్ట్ర నాయకులు ఘన్‌శ్యాం అన్నా షెలార్, ప్రహ్లాద్ రాథోడ్, శరద్ పవార్, బాల సాహెబ్, అరుణ్ కొడు, ఏకనాథ్ గోగాడే, ఘన్‌శ్యాం, ఖదీర్, మౌలానా తదితరులు ఉన్నారు.